ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సామాజిక వ్యవస్థలో సాంప్రదాయక జీవన విధానం ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతో కీలకంగా దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం కార్యక్రమం యూనివర్సిటీ ఆడి టోరియం లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని సైన్స్, ఇంజనీరింగ్ పరిశోధన బోర్డు విభాగం కార్యదర్శి ఆచార్య సందీప్ వర్మ అధ్యక్షత వహించగా , కాకతీయ విశ్వవిద్యాలయ ఉప కులపతి తాటికొండ రమేష్ , పాలక మండలి సభ్యులు, పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గవర్నర్ సౌందర్ రాజన్ మాట్లాడుతూ సంప్రదాయక జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనకు ఎంతగానో దోహదపడతాయని ఆమె అన్నారు, ఆరోగ్య పరిరక్షణ విషయంలో అందరూ జాగరూకతతో వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువతరం మారుతుందని ముఖ్యంగా ఆహారపు విషయాలలో సాంప్రదాయక ఆహారాన్ని తీసుకోకుండా, ఫాస్ట్ ఫుడ్ ఆహారాన్ని తీసుకోవడం చాలా వరకు విఘాతం కలుగుతుందని కాబట్టి ఆరోగ్య పరిరక్షణ విషయంలో యువత కీలకంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే ఆరోగ్యం ముఖ్యమని, కాబట్టి యువత ఎప్పుడు సంతోషంగా ఉండాలని జీవన విధానంలో సాంప్రదాయక విధానం అనుసరించాలని ఆమె సూచించారు. Covid 19 నివారణలో భారత దేశంలో ఉత్పత్తి చేసిన టీకామందు ప్రపంచానికి ఎంతగానో ఉపయోగపడిందని భారతదేశంలో టీకా తయారుచేసే పరిజ్ఞానం, భారతీయ శాస్త్రవేత్తలకు ఉందన్నారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానం ఎంతో పురోభివృద్ధి సాధించిందని ఆధునిక సాంకేతిక ను ఉపయోగించుకొని దేశం మరింత ముందుకు పోవాలని ఇందుకు యువత దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని గవర్నర్ అన్నారు. కాకతీయ సామ్రాజ్యం పాలనలో మహిళల పాత్ర గణనీయమైన ని రుద్రమదేవి ని ఆదర్శంగా తీసుకుని మహిళలు సాధికారిక సాధించడానికి ముందుకుపోవాలని ఆమె అన్నారు. విద్యార్థులు నేడు డిగ్రీలు తీసుకుంటున్నారు అంటే వారి వెనుక తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైందని వారు కష్టపడి మిమ్ములను చదివిస్తున్నారు అని వారి కష్టాలను వృధా చేయకుండా నిబద్ధతతో అభివృద్ధి సాధించాలని ఆమె అన్నారు. తరగతి గదిలో విద్యార్థి ఎంతో నేర్చుకుంటానని ఇందుకు ఇటీవల 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారతదేశంలో నూతన విద్యా వ్యవస్థ రానున్న రోజుల్లో ఎంతగానో అభివృద్ధి కి మార్గదర్శకాలు గా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసే దిశగా తన వంతు పాత్ర పోషిస్తానని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తో ఏర్పాటుచేసిన సమావేశంలో కూడా, విశ్వవిద్యాలయాల్లో బోధన పరిశోధన రంగాన్ని మరింత పటిష్ట పరచుటకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. నూతన విద్యా విధానం సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగ పడుతుందని గవర్నర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన ఆచార్య సందీప్ వర్మ మాట్లాడుతూ భారతదేశం నాగరికత ప్రపంచ నాగరికత అన్నింటిలో చాలా పురాతనమైన ని భారతీయ విజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా నాగరిక జీవనానికి దోహదపడిందని ముఖ్యంగా తక్షశిల, నలంద గొప్ప విద్యా కేంద్రాలను ఆయన అన్నారు.ప్రాచీన జీవనవిధానంలో సైన్స్, టెక్నాలజీ, ఆర్థిక సామాజిక విషయాలను తెలియజేసే గొప్ప విద్యా వ్యవస్థ ఉండేదని ఆయన అన్నారు. ప్రస్తుత జీవన విధానం దినదిన అభివృద్ధి సాధిస్తుందని ఇందులో విద్య ఎంతో కీలక భూమికను పోషిస్తున్న ని జాతీయ నూతన విద్యా విధానం 2020 భారతీయ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లో ఎంతో పురోభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని ఆయన అన్నారు. ఒకేషనల్ స్కిల్స్ తో కూడిన, మానవీయ శాస్త్రాలు, సంస్కృతి జీవన వ్యవస్థ పై ప్రభావాన్ని చూపుతాయని ఆయన అన్నారు. భారతదేశం కోవిడ్ 19 ఎదుర్కోవడంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించిందని ఆయన అన్నారు. కరోనా సమయంలో భారతదేశం ప్రజలు అనుసరించినా నిబద్ధత విధానమే ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశ ప్రధానమంత్రి సూచిస్తున్న విధంగా అభివృద్ధి పరుస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని అన్నారు. భారతదేశంలో ఫార్మసీ రంగం ఎంతగానో అభివృద్ధి దిశలో పయనిస్తుందని, ఇందులో ముఖ్యంగా కరోనా వైరస్ నివారణకు ఉత్పత్తి చేసిన వ్యాక్సినేషన్ ప్రపంచ దేశాల కంటే ముందుగానే భారతదేశంలో తయారు చేశామని, ఇది దేశ గొప్పతనం ఆయన అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని దేశం మరింత ముందుకు పోయే అవకాశం ఉందని ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా పురోభివృద్ధి సాధిస్తుందని ఇది భారతీయులందరు కలిసికట్టుగా ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న, అభివృద్ధి, బోధన పరిశోధన, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీల ఛాన్స్ లర్ డాక్టర్ తమిళ సై సౌందర్ రాజన్ చేతులమీదుగా ఆర్ట్స్, సోషల్ సైన్స్ , కామర్స్, సైన్స్, ఫార్మసీ, విద్యా విభాగం, ఇంజనీరింగ్ విభాగాలలో 52 పి హెచ్ డి డిగ్రీలు, 192 బంగారు పథకాలు అందజేశారు విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు డాక్టర్. చంద్రమౌళి, రచన రాజిరెడ్డి, డాక్టర్ నాగేంద్ర బాబు, డాక్టర్ మదన్ కుమార్, డాక్టర్ సీతారాం ఆచార్య మనోహర్, డాక్టర్ సుమతి రెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం, రిజిస్టర్ ఆచార్య వెంకట్ రామ్ రెడ్డి, పరీక్షల విభాగం అధికారి ఆచార్య మల్లారెడ్డి వివిధ విభాగాలకు చెందిన డీన్ లు అధ్యాపకులు, విద్యార్థులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు భారీ బందోబస్తు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయము ఛాన్స్లర్ డాక్టర్ తమిళ సౌందర్ రాజన్ గురువారం కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ రాక సందర్భంగా స్నాతకోత్సవ సభాస్థలి లో డాగ్స్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. స్నాతకోత్సవం ముగిసిన తర్వాత, గవర్నర్ విశ్రాంతి గృహానికి చేరుకుని, భోజనం అనంతరం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. పోలీసు బందోబస్తుకు హనుమకొండ ఎసిపి, కేయూ సిఐలు ఎస్ ఐ లు పోలీసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయానికి
11 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 22వ స్నాతకోత్సవం లో గవర్నర్ పాల్గొని పట్టాలు అందజేయడం వల్ల డిగ్రీ పొందిన, బంగారు పతకాలు పొందిన విద్యార్థులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.