ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వినాయక చవితి వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన చేసే నిర్వహకులు పోలీసులకు సహకరించాలని శుక్రవారం ఎస్పి పేర్కొన్నారు. గణేష్ వేడుకల్లో భాగంగా ఎక్కడా సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో పోలీసులతో పాటు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.
గణేష్ మండపం, నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఎస్పి కోరారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలతో సమన్వయం చేసుకోవాలని ఎస్పి సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలను సక్రమంగా నిర్వహించుటకు నిర్వాహకులు పోలీసు శాఖ సూచించిన కింది సూచనలు పాటించాలని ఎస్పి అన్నారు.
వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయాల్సిన నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత ఎస్సై మరియు సీఐ ద్వారా డీఎస్పీ గారి దగ్గర అనుమతులు తీసుకోవాలి.
డీఎస్పీ ఆఫీస్ నందు అనుమతులకు దరఖాస్తు పెట్టేముందు దరఖాస్తు తో పాటు పంచాయతీ లేదా మున్సిపాలిటీ, ఫైర్ డిపార్ట్మెంట్ మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుమతులు జత చేయాలి.
బలవంతపు చందాలు వసూలు చేయరాదు. ప్రతి మండపానికి వారి సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి ఒక పోలీసును కోఆర్డినేటర్ గా (విపిఓ) నియమించడం జరుగును.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ,కృతిమ రంగులు ఉపయోగించిన విగ్రహాలను పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఉపయోగించరాదని, మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే ఉపయోగించవలెనని సూచన చేయడమైనది.
విగ్రహం యొక్క సైజు మరియు బరువు ఉత్సవం
ఎన్ని రోజులు నిర్వహిస్తారు నిమజ్జనం తేదీ సమయం సంబంధిత పోలీసులకు ముందుగానే తెలియపరచాలి.
దీపారాధన సమయం నందు మరియు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైన (fire extinguisher ) అందుబాటులో ఉంచుకోవాలి.
బాక్స్ టైపు స్పీకర్ను మాత్రమే వినియోగించవలెను
డీజేలు వినియోగించరాదు.
రాత్రి సమయంలో కమిటీ సభ్యులు మండపం వద్ద కాపలాగా ఉండాలి నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ లు ఏర్పాటు చేసుకోవాలి.
మండపాలు ఉండే ప్రదేశం వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా విగ్రహాల దగ్గర వాహనాలు పార్కింగ్ చేయరాదు. ఈ విషయం లో నిర్వాహకులు గమనించాలి.
ఊరేగింపు సమయంలో ఆశ్లీల పాటలు, డాన్సులు చేసిన ఎడల మరియు మందు గుండు సామాన్లు వెలిగించిన ఎడల వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోబడును .
నిమజ్జనం నిర్దేశించిన సమయంలో ఊరేగింపు ప్రారంభించి నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిమజ్జనం చేయవలెను.
ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని నిర్వాహకులకు పోలీసు శాఖ విజ్ఞప్తి చేయడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై పోలీసులకు తెలపాలని, అలాగే పోలీసులు విద్వేషం రగిలించే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పి సురేందర్ రెడ్డి ఆదేశించారు.

Post A Comment: