కె. నాగరాజు - అడ్వకేట్
                                                                         (బీకాం. ఎంఏ జర్నలిజం, ఎల్ఎల్బీ)

                                                                                            కామారెడ్డి

"పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు" అని మన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. మరి అలాంటి పల్లెల్లో మనకు ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగించింది. మన రాష్ట్ర  స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ (12778), ఎంపీటీసీ (5773), జెడ్పిటీసీ (566) స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నవి. ఈ ఎన్నికలు మన ప్రత్యేక్ష్య ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అంటారు మరి కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఒకసారి ఈ ఎన్నికల చరిత్ర చూడాల్సిందే. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప మలుపు 1992లో వచ్చింది. అదే 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు. ఈ రెండు సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా లభించింది. 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలపరిచారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లుగా మూడు స్థాయిలలో స్థానిక పాలన ఏర్పాటైంది. ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు, మహిళలకు 33% రిజర్వేషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ఆర్థిక సంఘాలు ఏర్పాటయ్యాయి. ఇక 74వ సవరణ పట్టణ ప్రాంతాలకు సంబంధించినది. దీనివల్ల మునిసిపాలిటీలకు కూడా స్వతంత్ర హోదా లభించింది. నగర పంచాయతీ, మునిసిపాలిటీ, మహానగర పాలకమండళ్లు ఏర్పాటు అయ్యాయి. ఈ సవరణల ద్వారా ప్రజలకు తమ సమస్యలపై నేరుగా పరిష్కరించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అలాగే గ్రామీణ పట్టణ స్థాయిలో సామజిక న్యాయం, నాయకత్వ అభివృద్ధి, మరియు ప్రజా పాలన అనే సూత్రాలపై స్పష్టత వచ్చింది. ఈ రెండూ సవరణలు వలన భారతదేశంలో కేంద్రీకృతమైన పాలన నుంచి ప్రజల పాలన దిశగా ఒక గొప్ప మార్గం చూపాయి. ఇవి ప్రజాస్వామ్యానికి నిజమయిన స్వరూపాన్ని ఏ విధంగా చూపెట్టినవి అని ఒకసారి పరిశీలించి చూస్తే మనకు అనేక అంశాలు స్ఫురణకు వస్తాయి.  

అవి ఏంటి అంటే! స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా సామాన్య ప్రజలకు ప్రత్యక్ష పాలనలో అవకాశం లభిస్తుంది. ప్రజలు స్వయంగా తమ నాయకులను ఎన్నుకుంటారు, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వారే పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇది ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని మరియు సమానతను అందిస్తుంది.  ప్రతి గ్రామాలలో పట్టణాలలో అనేక సమస్యలు ఉంటాయి. వారి స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కోసం అక్కడి యంత్రాంగం మరియు ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. (ఉదాహరణకు: నేటి సమస్య, మురికి కాలువ సమస్య, రోడ్డు సమస్య కావచ్చు) స్థానిక సంస్థల ద్వారా ఈ అవసరాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. మహిళలు, దళితులు, గిరిజనులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కలిగి ఉండడం వల్ల వారు నాయకత్వంలోకి వస్తున్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఇది దోహదపడుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా గ్రామీణ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా గ్రామపంచాయతీకి చేరవేయడం. ఉదాహరణకు స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం నిధులు, వైకుంఠధామం) స్థానిక సంస్థల ద్వారా అమలవుతాయి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నిర్ణయించడం, స్థానిక నాయకుల ద్వారా ఈ పథకాలు వేగంగా ప్రజలకు చేరతాయి. దీని ద్వారా ఏదైతే ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. గ్రామీణ స్థాయిలో జరిగే చిన్న చిన్న వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించి వాటిని నివారించడం. ఇది న్యాయవ్యవస్థపై భారం తగ్గిస్తుంది, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తుంది.

కానీ ప్రస్తుత రోజుల్లో ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని మరియు అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వాము కల్పిస్తూ, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాయా? అంటే అది సత్య దూరమే!.  మనం ఒకసారి పునరాఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఇవే రాజకీయ పార్టీల ఉనికిని కాపాడుతుందనీ వారి విశ్వాసం. మరి రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మంచిదే దాని ద్వారా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. కానీ ఏదైతే మనం రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ఎన్నికల నిర్వహించుకొని గ్రామ అభివృద్ధికి ఆ విధంగా తోడ్పడుతున్నాయా? అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. సర్పంచ్ అంటే గ్రామంలో ఉండే పంచాయతీలకు సమస్యలను తీర్చే ఒక పెద్ద దిక్కు.  గ్రామ సర్పంచ్ అంటే అది ఒక గ్రామం పై అధికారం చలాయించడం అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి గ్రామంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయి. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క గుర్తింపు పైన మాత్రమే జరిగే ఎన్నికలు. గ్రామానికి ఉపయోగపడే, అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవడంలో సఫలీకృతం కావాలి. ఇది యావత్ తెలంగాణ ప్రజలు గ్రహించాలి. మనకు కావలసింది ఒక నిబద్ధత కలిగిన గ్రామ ప్రతినిధి కానీ అక్కడి అధికారులకు ఎమ్మెల్యేలకు బానిసలాగా పనిచేసే వ్యక్తి కాదు. గ్రామం కోసం అవసరమైన నిధులను పోరాడి తెచ్చే నాయకత్వాన్ని ఎంచుకోవడంలో ఓటర్లు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. కేవలం రాజకీయ పార్టీ వ్యక్తిగా, పెద్ద నాయకులతో ఉంటున్నాడు కాబట్టి మంచి చేస్తాడు అనే భ్రమలో పడకుండా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేయగలరు వారిని ప్రజలు గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనకు ఏదైతే రాజ్యాంగం చట్టబద్ధంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలాలను మనం అందుకోగలుగుతాం. ఒక మహాత్ముడు ఇలా అన్నారు "గ్రామం నశిస్తే, భారతదేశం కూడా నశిస్తుంది. భారతదేశం యొక్క ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది." గ్రామానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసే వారిని ప్రజలు గ్రహించాలి.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే గ్రామాలలో ఒక అలజడి వాతావరణ ఏర్పడుతుంది. ఈసారి ఎవరు పోటీ చేయాలి? ఎవరు పోటీ చేస్తే ఎంత? ఖర్చు పెడతారు. ఎవరు పోటీ చేస్తే అభివృద్ధి చేస్తారు. ఎవరు పోటీ చేస్తే దోచుకుంటారు. అనే ప్రశ్నలు చర్చ తరచుగా వింటుంటాం. అయితే ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే మిగతా ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం జరుగుతుంది. కానీ అదే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓటింగ్ నమోదు శాతం తగ్గుతుంది. అసలు దీనికి కారణం ఏమిటి? అని ఎప్పుడైనా ప్రభుత్వాలు ఆలోచించాయా? అయితే అదే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఓటింగ్ శాతం మళ్ళీ కాస్త తగ్గిపోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణాలు ఏమిటి? 

అయితే ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి. అయితే మనం సర్పంచ్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా అక్కడ సిబ్బంది మరియు పోటీ చేసే అభ్యర్థులు ముందు నుండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రధానంగా  గ్రామాల నుండి అనేకమంది పట్టణాలకు వెళుతూ ఉంటారు. యువకులు పై చదువులకు కావచ్చు, అలాగే కూలి పని కోసం కావచ్చు, కొందరు ఉద్యోగరీత్యా వెళుతుంటారు. కానీ వీరు అందరూ ఓటు హక్కును సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే పోటీ చేసే అభ్యర్థి తన సొంత డబ్బును ఖర్చు చేసి వారిని తీసుకురావడం మళ్ళీ తీసుకుపోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ కనీసం ఓటింగ్ శాతం 88% (2019)వరకు కూడా మనకు కనిపిస్తుంది. అదే మిగతా జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలలో 77.81% (2019) తగ్గుతుంది కారణం అది కొంతమేరకు విస్తృతస్థాయి కి సంబంధించింది రెండు గ్రామాలు లేక ఒక మండలానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి. మళ్లీ ఇంకొంత ముందుకెళితే అసెంబ్లీ 71.34%(2023)మరియు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది 65.67%(2024) ఇంకాస్త తగ్గిపోతుంది. కారణం ఒకటే ఇక్కడ విస్తృతస్థాయి కాబట్టి చాలామందికి ఓటు వేసిన వేయకున్నా పట్టించుకునే నాధుడు లేడు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇంకా వోటింగ్ పెంచి ప్రజాస్వామ్యాన్ని పరఢవిల్లే విధంగా చేయవచ్చు. రాష్ట్రం మొత్తంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దానిని ఈ ఎన్నికల దృష్ట్యా పురుషులకు కూడా వర్తింప చేస్తే కొద్ది మేరకు మనం మంచి ఫలితాలను చూడవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే దీని ద్వారా ఒక నిష్పక్షికమైన ఓటింగ్ జరుగుతుంది. సాధారణంగా పైన చెప్పినట్లు సర్పంచ్ ఎన్నికల్లో ప్రయత్నం చేసి తీసుకు వస్తారు కొందరు వచ్చేస్తుంటారు. అయితే వచ్చిన ఓటరు స్వతంత్రంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే స్వాభిమానాన్ని కలిగి ఉండాలి. ఆ స్వభిమానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే చిన్న ప్రయత్నమే ఈ ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఎన్నికల రోజు మాత్రమే వర్తింప చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కొన్ని ప్రధాన పార్టీలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులకు అత్యధిక అవకాశం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అయితే అది పూర్తిస్థాయిలో సఫలీకృతం కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు, ప్రధాన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫునుండి జరగాలి. ఇలా యువనాయకత్వానికి అవకాశం ఇస్తే  అది స్థానిక సంస్థల ఎన్నికల ఆశయాలు  పూర్తిస్థాయిలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది.  దీనికోసం ఎన్నికలు నిస్వార్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరగాలి. గ్రామస్థాయిలో ఉన్న పంచాయితీ యంత్రాంగాన్ని పటిష్టం చేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకునేటట్లు చేయడం. ప్రతి గ్రామంలో యువనాయకత్వానికి అవకాశం ఇవ్వడం వలన వారు ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. అలాగే ఇలాంటి  సమయంలో వారే అనేక పనులకు బుజానవేసుకొనే అవకాశము కూడా ఉంది, అవి చూసుకుంటే, వాలంటీర్ల (యువకులను) వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం వంటి పంపిణీ చెయ్యకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారికి సమాచారం ఇస్తారు. వాలంటీర్ల ద్వారా అవగాహన సదస్సులు మరియు సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లు ఎలాంటి  ప్రలోభాలకు (డబ్బు, మద్యం, కుల సంఘాలు సొంత ప్రయోజనం కోసం) గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవడం. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో పాటు గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకోవచ్చు. ఇది అందరి కృషి వల్లనే సాధ్యమవుతుంది సంపూర్ణ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఈ ఎన్నికలను నిర్వహించుకోవాలి. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా ఈ ప్రయత్నం చేయాలి. "గ్రామాల అభివృద్ధియే దేశ అభివృద్ధి ఇదే నినాదంతో మనం ముందుకు వెళ్లాలి".  ఇదే విధంగా మండల పరిషత్, జిల్లా పరిషత్‌, నగర పంచాయతీ, మునిసిపాలిటీ లలో కూడా పనిచేస్తే ప్రజలకు చేరువుగా ఉన్న వ్యవస్థలతో ప్రజాస్వామ్యానికి బలాన్ని, న్యాయాన్ని చేకూరుస్తూ అన్ని వర్గాలకు అభివృద్ధికి, సామాజిక సమానత్వాము కల్పిస్తూ, సామాజిక సామరస్యాన్ని మరియు సోదర భావాన్ని నిర్మాణం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా భారతదేశ ఆత్మను సుసంపన్నం చేసే దిశగా ప్రయత్నం చేసిన వాళ్ళము అవుతాము.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: