ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను డిప్యూటీ సీఎంగా నియమించే అంశంపై అధికార వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు ఆమె ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఎన్సీపీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తు వ్యూహం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా పూణే జిల్లా పరిషత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఈ క్రమంలో సునేత్రా పవార్‌కు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పార్టీ సీనియర్ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. సునేత్రా పవార్‌కు డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రిత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ శాఖలు రాజకీయంగా, పరిపాలనా పరంగా ప్రాధాన్యత కలవిగా ఉండటంతో ఆమె పాత్ర మరింత కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, మహిళా ఓటర్లను ఆకర్షించడం, ఎన్సీపీకి కొత్త ఉత్సాహం తీసుకురావడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రమాణస్వీకారం ఉంటుందా? లేక చర్చల వరకే పరిమితమవుతుందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాబోయే గంటల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Home
POLITICS ( రాజకీయం )
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ పేరు తెరపైకి

Post A Comment: