హైదరాబాద్: ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అలాగే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టడం వంటి హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దీక్షకారులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చే వరకు తమ ఆందోళన ఆగదని వారు స్పష్టం చేశారు. సర్వాయి పాపన్న మహారాజ్ తెలంగాణ గర్వించదగ్గ వీరయోధుడని, ఆయనకు తగిన గౌరవం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేసి, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టే వరకు తమ నిరవధిక దీక్ష కొనసాగుతుందని దీక్షకారులు వెల్లడించారు. ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజలు, వివిధ సామాజిక సంఘాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కండ్లుండి చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ న్యాయమైన డిమాండ్‌కు సంఘీభావం తెలపాలని వారు కోరారు.
హైదరాబాద్, జూన్ 8: మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. రైతు సంక్షేమం, సింగరేణి అభివృద్ధి, ఎన్నికల హామీల అమలుపై బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వరుస ఆరోపణలు చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు అర్హులైన రైతులకు రూ.500 బోనస్ అందిస్తూ నిరంతరాయంగా ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లను పర్యవేక్షిస్తోందని చెప్పారు. హరీష్ రావు 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలను ఒకసారి పరిశీలించి, అందులోని హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. రైతుబంధుకు ఎగనామం పెట్టలేదని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంతోనే రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హరీష్ రావుకు సూచించిన శ్రీధర్ బాబు, కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ వ్యతిరేక ఎంఎండీఆర్ చట్టానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపిందని ఆరోపించారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించడం వల్ల కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3 వంటి కీలక బొగ్గు గనులు సంస్థకు దక్కలేదని పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదేవిధంగా, బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బొగ్గు, విద్యుత్ బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరాయని ఆరోపించారు. శ్రీరాంపూర్ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 10 వేల నూతన కార్మిక క్వార్టర్లు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి పెంపు, కార్మిక సంక్షేమ చర్యలు వంటి హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పలు సంక్షేమ చర్యలు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడంతో పాటు, శాశ్వత కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమా, లాభాల వాటా పంపిణీ, బీసీ లైజనింగ్ అధికారుల నియామకం, సోలార్-థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 2014 నుంచి సింగరేణిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రైతులు, కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో రాజకీయంగా సంచలనం రేపుతున్న ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్‌పై పోక్సో కేసు నమోదైంది. తమ 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో కూడా అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరధ్‌పై BNS సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 r/w 12 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, తమ కూతురు ఈ ఘటన కారణంగా రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ వర్గం మాత్రం ఈ వ్యవహారం హనీ ట్రాప్ అని, రూ.5 కోట్లు డిమాండ్ చేశారని చెబుతోంది. అంతేకాకుండా ఇప్పటికే రూ.50 వేల రూపాయలు ఇచ్చామని కూడా పేర్కొంటున్నారు. అయితే “ఎలాంటి తప్పు చేయనప్పుడు రూ.50 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు?” అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం అందించే హామీతో సహా అన్ని సంక్షేమ పథకాలను ఈ ఐదేళ్ల పదవీకాలంలో పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఓట్ల కోసం వారి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం మాట తప్పదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును దెబ్బతీయడానికే అబద్ధపు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని, మంత్రులందరూ కలిసి సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు విశ్రాంతి తీసుకోమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.





