భూపాలపల్లి జిల్లా: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే పత్రికారంగంపై, సమాజ హితమే ధ్యేయంగా పనిచేసే విలేఖరులపై భౌతిక దాడులకు తెగబడటం పత్రికా స్వేచ్ఛను నొక్కేసే కక్షపూరిత చర్య అని తెలంగాణ శ్రామిక పాత్రికేయుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్నల సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో విధి నిర్వహణలో ఉన్న విలేఖరిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే విలేఖరులకు రక్షణ లేకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు సేకరించే విలేఖరులపై ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థనే సవాలు చేయడమని పేర్కొన్నారు. చిట్యాల మండలంలో విలేఖరిపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విలేఖరులపై వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత విలేఖరికి పూర్తి వైద్య సహాయం అందించడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో విలేఖరులపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈర్నల సుమన్ హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.

Post A Comment: