Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
రామగుండం, జూన్ 7: కుల, మతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటుతూ సమతా ఫౌండేషన్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచింది. రామగుండం 33వ డివిజన్‌లోని అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ నిరుపేద ముస్లిం యువతి వివాహానికి సమతా ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులతో వివాహ ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న సమతా ఫౌండేషన్ చైర్మన్ డా. దుర్గం నగేష్ స్పందించి, వివాహానికి అవసరమైన 25 కిలోల బియ్యంతో పాటు రూ.5 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. దుర్గం నగేష్ మాట్లాడుతూ, పేదరికం ఎవరికీ శాపంగా మారకూడదని, ఆనంద క్షణాలను పంచుకోవడంలో ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మానవత్వమే సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చెప్పారు. సమతా ఫౌండేషన్ అందించిన సహాయంపై పెళ్లికూతురు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో ఆదుకున్న డా. దుర్గం నగేష్, ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల, మాసూమ్ అలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ, సమతా ఫౌండేషన్ ద్వారా డా. దుర్గం నగేష్, ప్రమీల దంపతులు అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. నిరుపేద కుటుంబాల వివాహాలకు, అవసరమైన వారికి అందిస్తున్న సహాయం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నాసా సునీత, గన్న మహేష్, భూస్పాక రామచందర్, బెక్కం నిఖిల్ సాయి, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, జిమ్మిడి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
