కాటారం, జూలై 17: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి ఇంట్లో కనీసం ఒక పండ్ల మొక్కను నాటి దానిని సంరక్షించాలని కాటారం మండలం ధన్వాడ గ్రామపంచాయతీ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ధన్వాడ గ్రామపంచాయతీలో ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చెట్లు ప్రకృతికి ప్రాణాధారం అని, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని జీవించేంత వరకు సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పండ్ల మొక్కలను ప్రతి ఇంటి ఆవరణలో నాటి, వాటిని క్రమం తప్పకుండా నీరు పోసి పెంచాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు గ్రామపంచాయతీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, మొక్కల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందించి మొక్కలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: