భూపాలపల్లి: హక్కుల నేత, శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భూపాలపల్లిలో శనివారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నాయకత్వంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి, వాంగ్చుక్ డిమాండ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి, దాని స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇచ్చిన "చలో సంసద్" పిలుపునకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. సోనం వాంగ్చుక్ డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ భూపాలపల్లిలో ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: