Articles by "kaleshwaram ( కాళేశ్వరం )"
Showing posts with label kaleshwaram ( కాళేశ్వరం ). Show all posts
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
 

హైదరాబాద్, జూలై 7: కాలేశ్వరం గ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉపసర్పంచ్ చెమ్మాల సుధీర్ కుమార్, వార్డు సభ్యులు రేవెల్లి రాకేష్, పానేం సంతోష్, వెన్నపురెడ్డి విజయలక్ష్మి, కావేరి జయలక్ష్మి, పెద్ది లక్ష్మి, షేక్ రహీమ బేగం, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంతతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముల్కల రాజిరెడ్డి, కాటారపు శేఖర్, వెన్నపురెడ్డి సుకుమార్ రెడ్డి, శనిగరం శ్రీధర్ రెడ్డి, అమృత రమేష్, ఎండీ ముస్తఫా, వెన్నపురెడ్డి రంజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు సన్నబియ్యం, మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పాటు యువతకు కల్పిస్తున్న అవకాశాలు తమను ఆకర్షించాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి కామెడీ శ్రీనివాస్ రెడ్డి, మహాదేవపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకరి రాజబాబు, మాజీ సర్పంచ్ బందెల సత్యమ్మ, గ్రామ శాఖ ప్రచార కార్యదర్శి షేక్ షకీల్, యువ నాయకులు మాచర్ల అరుణ్ కుమార్, అమృతపు సారయ్య తదితరులు పాల్గొన్నారు.






Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహదేవ్‌పూర్, జూలై 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించి పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుందని, అయితే పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుని ఆలస్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తమ పర్యటనకు ఆటంకాలు కల్పించారని విమర్శించారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి తాము రాలేదని, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడానికే ఈ పర్యటన చేపట్టామని కేటీఆర్ తెలిపారు. గోదావరి నీటిని ఎత్తిపోసి ఎగువ ప్రాంతాలకు తరలించే బృహత్తర ప్రణాళికను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని, ఎల్ అండ్ టీ సంస్థ ఉచితంగా మరమ్మతులు చేస్తామని ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. 
ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 98 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని, మోటార్లు ఆన్ చేస్తే మిడ్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్‌పీతో పాటు ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించవచ్చని తెలిపారు. కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ వరి ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని, దీని ప్రభావం హైదరాబాద్ తాగునీటిపైనా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ప్రారంభించి నీటిని ఎత్తిపోయాలని, లేదంటే 50 వేల మంది రైతులతో పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇక బీఆర్‌ఎస్ హయాంలో రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని, కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు, రైతుబంధుకు రూ.72 వేల కోట్లు, రైతుబీమాకు రూ.30 వేల కోట్లు వెచ్చించామని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

పుట్ట మధూకర్ సవాల్

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీళ్లు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌లు దమ్ముంటే కన్నెపల్లికి వచ్చి స్వయంగా నీటి లభ్యతను పరిశీలించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సవాల్ విసిరారు. కేటీఆర్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
మేడిగడ్డ వద్ద చిన్న మరమ్మతులతోనే ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చని, కానీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల ప్రయోజనాల దృష్ట్యా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
మహాదేవపూర్, జూన్ 19: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దేవాలయ అభివృద్ధి పనులపై అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేవస్థాన అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. భక్తుల సహకారం, ప్రభుత్వ నిబద్ధతతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని తెలిపారు. 

లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మెడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యలు, కుట్రలు, భూదందాలు, రౌడీయిజం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మహాదేవపూర్ ప్రాంత ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అఫ్జల్ ప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, గ్రామ సర్పంచ్ హసీనా బానో, ఎక్స్‌పీఎస్సీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, రామన్ రావు, తిరుపతిరెడ్డి, శంకరయ్య, శివరాజు, సంతోష్, మోత సాంబయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కోట సమ్మయ్య, వార్డ్ సభ్యులు గడ్డం స్వామి, నయూముద్దీన్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

"కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం" అంటూ భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య పుష్కర స్నానాలు ఆచరిస్తూ ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. పుష్కరాల 5వ రోజు సందర్భంగా త్రివేణి సంగమం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నదీమాతకు నీరాజనాలు అర్పిస్తున్నారు. భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచి భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


సోమవారం ప్రత్యేకత.. దానధర్మాలకు ప్రాధాన్యం

పుష్కరాల తొలి 12 రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. 5వ రోజు సోమవారం కావడంతో శివారాధనతో పాటు దానధర్మాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. పుష్కర స్నానాల అనంతరం భక్తులు అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి పుణ్యకార్యాల్లో పాల్గొంటున్నారు. ప్రకృతి పరిరక్షణ, నదీ సంస్కృతి పరిరక్షణకు సంకేతంగా పుష్కరాల సందర్భంగా నదీతీరాల్లో స్వచ్ఛత పాటించాలని, ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని ఆధ్యాత్మిక వేత్తలు పిలుపునిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాళేశ్వరం ఆలయ పునఃప్రతిష్ఠ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్, ఐఎస్‌డబ్ల్యూ అధికారులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణం, అప్రోచ్ రోడ్ల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని విభాగాల మధ్య సమన్వయం అవసరమని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, తక్షణ వైద్య సేవల కోసం వైద్యులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భద్రతా పరమైన చర్యల్లో భాగంగా సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ సూచించారు.