మహదేవ్‌పూర్, జూలై 5 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించి పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి కన్నెపల్లికి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుందని, అయితే పెంబర్తి, జనగామ, ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్‌పూర్ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుని ఆలస్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తమ పర్యటనకు ఆటంకాలు కల్పించారని విమర్శించారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి తాము రాలేదని, తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడానికే ఈ పర్యటన చేపట్టామని కేటీఆర్ తెలిపారు. గోదావరి నీటిని ఎత్తిపోసి ఎగువ ప్రాంతాలకు తరలించే బృహత్తర ప్రణాళికను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని, ఎల్ అండ్ టీ సంస్థ ఉచితంగా మరమ్మతులు చేస్తామని ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ప్రస్తుతం కన్నెపల్లి వద్ద 98 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తోందని, మోటార్లు ఆన్ చేస్తే మిడ్ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్‌పీతో పాటు ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించవచ్చని తెలిపారు. కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ వరి ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని, దీని ప్రభావం హైదరాబాద్ తాగునీటిపైనా పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ప్రారంభించి నీటిని ఎత్తిపోయాలని, లేదంటే 50 వేల మంది రైతులతో పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇక బీఆర్‌ఎస్ హయాంలో రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని, కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.80 లక్షల కోట్లు, రైతుబంధుకు రూ.72 వేల కోట్లు, రైతుబీమాకు రూ.30 వేల కోట్లు వెచ్చించామని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద నీళ్లు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌లు దమ్ముంటే కన్నెపల్లికి వచ్చి స్వయంగా నీటి లభ్యతను పరిశీలించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సవాల్ విసిరారు. కేటీఆర్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
మేడిగడ్డ వద్ద చిన్న మరమ్మతులతోనే ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చని, కానీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల ప్రయోజనాల దృష్ట్యా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మేడిగడ్డ వద్ద చిన్న మరమ్మతులతోనే ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చని, కానీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల ప్రయోజనాల దృష్ట్యా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.



Post A Comment: