కాటారం, జూన్ 29: కాటారం డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు, పోడు భూముల దందాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొందరు అటవీ శాఖ అధికారుల ప్రమేయంతో అటవీ భూములు నాశనమవుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్, అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ భూముల విక్రయాలు, ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, కొందరు ఫారెస్ట్ అధికారులు, స్థానిక బ్రోకర్లు కలిసి ఇతర ప్రాంతాల వ్యక్తులకు భూములను విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను మాయమాటలు చెప్పి, బెదిరింపులకు పాల్పడి స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెం పరిధిలో అటవీ భూముల అక్రమ విక్రయాలపై గతంలో సీసీఎఫ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన చర్యలు కనిపించలేదని తెలిపారు. అలాగే మల్హర్ మండలంలోని కొయ్యూర్ రేంజ్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇటీవల సస్పెన్షన్ చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలు అన్ని చోట్ల కొనసాగించాలని కోరారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని, వర్షపాతం తగ్గుతూ కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ నిర్వహించి, సంబంధిత అధికారుల కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల వివరాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులైన అధికారులు, బ్రోకర్లు, ఇతర సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని గిరిజనుల పోడు భూములకు, అటవీ సంపదకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: