కాటారం, ఆగస్టు 17: నాటుసారాయి తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ కె. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హెచ్. దత్తురాజ్ గౌడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. కిరణ్ ఆదేశాల మేరకు కాటారం ఎక్సైజ్ స్టేషన్, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ వరంగల్, జిల్లా టాస్క్‌ఫోర్స్, భూపాలపల్లి స్టేషన్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మహాముత్తారం మండలంలోని కోర్లకుంట, దొబ్బలపాడు, మలహర్ మండలంలోని ఎడ్లపల్లి, కొండంపేట, కాటారం మండలంలోని గంగారం, చింతకాని గ్రామాల్లో నాటుసారాయి తయారీ స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 10 మందిపై కేసులు నమోదు చేసి, 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అధికారులు 46 లీటర్ల నాటుసారాయి, 20 కిలోల చక్కెర, 2 కిలోల డ్రై ఈస్ట్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాటుసారాయి తయారీకి సిద్ధంగా ఉంచిన 1,250 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా నాటుసారాయి వల్ల కలిగే అనర్థాలు, ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావంపై అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాటుసారాయి తయారు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో కాటారం ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాదావత్ కిష్టయ్య, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజ సమ్మయ్య, ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, చంద్రశేఖర్, భూపాలపల్లి ఎస్‌ఐ ఎస్‌కే. రబ్బానీతో పాటు హెడ్ కానిస్టేబుల్ గణేష్, కానిస్టేబుళ్లు కృష్ణ నాయక్, శ్రీనాథ్, హుస్సేన్, కుమార్ పాల్గొన్నారు.

Post A Comment: