విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తోందని ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బంధు సుజాత, జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో కేంద్ర ప్రభుత్వం అనైతికంగా వ్యవహరించిందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గుండాలను దింపి విద్యార్థులపై దాడులు చేయించి, విద్యార్థులే హింసకు పాల్పడ్డారనే విధంగా బీజేపీ ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరిగితే తప్ప మరోసారి ఇటువంటి తప్పులు జరగవని అన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు చివరికి పేపర్ లీకేజీలు ఎదురైతే వారు తమ భవిష్యత్తు కోసం పోరాటంలోకి దిగకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై అనైతికంగా లాఠీచార్జి చేయడం బీజేపీ ప్రభుత్వం క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని మోదీ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. లాఠీచార్జిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విద్యార్థుల పోరాట హక్కును హరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించరాదని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తన నియంతృత్వ వ్యవహారశైలిని విరమించుకోకపోతే విద్యార్థుల పోరాటాన్ని ఎదుర్కోక తప్పదని, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యాశాఖలో ప్రక్షాళన చేపట్టే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరుణ్, కార్తీక్, మైపాల్, మహేష్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: