కాటారం: నీట్ పేపర్ లీక్, కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, విద్యార్థుల సమస్యలపై కాటారం చౌరస్తాలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కాటారం మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటివరకు రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై బీజేపీ నాయకులు మౌనం వహించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడులు చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హత్య అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిందని, అలాంటి కుటుంబానికి చెందిన నాయకులపై లాఠీచార్జీ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థినులు, మహిళలపై వేలాది మంది పోలీసులతో లాఠీచార్జీ చేయించడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణమన్నారు. దేశ యువత, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని గోప్యంగా ఉంచడం అప్రజాస్వామికమని ప్రభాకర్ రెడ్డి ఖండించారు. దేశంలో యువత సమస్యలపై పోరాడుతుంటే మతం పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నాయకులు విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. అమిత్ షా తన కుమారుడిని బీసీసీఐ కార్యదర్శిగా చేయడంలో చూపిన శ్రద్ధను దేశంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తును కాపాడటంలో చూపడం లేదని విమర్శించారు. విద్యార్థులకు, యువతకు న్యాయం జరిగే వరకు, బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని వేమునూరి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.


Post A Comment: