రామగిరి: దుద్దిళ్ల శ్రీధర్‌కు ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు ఖాకీ యూనిఫాంలకు అవమానాలేనని, ఇప్పటికే పలుమార్లు చెప్పినా పోలీసుల్లో మార్పు రావడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీజీ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరూ రాజ్యాంగాన్ని తెలుసుకుని అభివృద్ధి చెందవద్దనే కక్షతో మంథని ఎమ్మెల్యే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలో తనపై అనేక కేసులు పెట్టించడంతో పాటు చివరకు రౌడీషీట్ ఓపెన్ చేయించిన కీర్తి దుద్దిళ్లకే దక్కుతుందని పుట్ట మధూకర్ అన్నారు. ప్రస్తుతం ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణ గౌడ్‌పై ఇప్పటికే 20 కేసులు పెట్టించి, అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. జూన్ 9న పూదరి సత్యనారాయణ గౌడ్‌పై ముత్తారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైతే, రామగిరి పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో సత్యనారాయణ గౌడ్ తల్లి, భార్య ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, ముత్తారంలో కేసు నమోదైందని, తీసుకెళ్లేందుకు వచ్చామని పోలీసులు చెప్పారని అన్నారు. ముత్తారంలో కేసు అయితే రామగిరి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా కేసు పెట్టారని పుట్ట మధూకర్ ఆరోపించారు. పూదరి సత్యనారాయణ గౌడ్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన రామగిరి పోలీసులపై దాడి చేసేందుకు ఆయన తల్లి, తండ్రి, భార్య, పెద్దమ్మ, బావలు కూడగట్టుకుని ఉన్నారని కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకచోటికి వస్తారని, అలా వచ్చినంత మాత్రాన ఇంత నీచమైన కేసు పెడతారా అని ప్రశ్నించారు. కేసు పెట్టడంతో పాటు 60 ఏళ్ల పూదరి సత్యనారాయణ గౌడ్ తల్లిపై దౌర్జన్యం చేసి గాయపర్చారని ఆరోపించారు. జూన్ 9న కేసు నమోదై ఇప్పటికి 42 రోజులు అవుతోందని, సత్యనారాయణ గౌడ్‌ను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక్కో బృందంలో పది మంది పోలీసులు, ముగ్గురు ఎస్‌ఐలు, ఒక సీఐ, ఒక ఏసీపీ, ఒక డీసీపీ స్థాయి అధికారులు 42 రోజులుగా కేవలం సత్యనారాయణ గౌడ్ కోసమే తిరిగారని అన్నారు. సత్యనారాయణ గౌడ్‌ను పట్టుకోలేకపోతున్నారని ఇటీవల రాత్రి డీసీపీని దుద్దిళ్ల నానా దుర్భాషలాడారని ఆరోపించారు. దుద్దిళ్ల శ్రీధర్ కోసం పనిచేస్తే కోర్టులో చివాట్లు పడ్డాయని, ఏం కేసులు పెట్టారని, ఏం జ్ఞానం ఉందని హైకోర్టు జడ్జి హెచ్చరించారని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ఇప్పటికే రామగుండం సీపీకి విషయం చెప్పామని, ఐపీఎస్ అధికారిగా జాగ్రత్తగా ఉండాలని సూచించినా మార్పు రావడం లేదన్నారు. ఒకవైపు దుద్దిళ్లతో తిట్లు, మరోవైపు హైకోర్టులో చివాట్లతో ఖాకీ యూనిఫాంకు అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. పూదరి సత్యనారాయణ గౌడ్‌ను పట్టుకోలేకపోతున్నారనే కారణంతో రాజును తీసిపడేసి, వాడుకుని విసిరిపడేయడం దుద్దిళ్లకు అలవాటని పోలీసులు గుర్తించాలన్నారు. రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు దుద్దిళ్ల హైదరాబాద్‌లో ఉన్నా పూదరి సత్యనారాయణ గౌడ్‌కు జరిగినట్లే సేమ్ టు సేమ్ ట్రీట్‌మెంట్ ఇస్తామని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నమోదైన కేసులపై రివ్యూ పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరాచకాలు, అక్రమ సంపాదనపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చీకటి పాలన పోయే వరకు తన కొడుకుతో పాటు తన కుటుంబం అండగా ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ తల్లి, భార్య చెబుతున్నారని పుట్ట మధూకర్ తెలిపారు. నియోజకవర్గంలోని అనేక కుటుంబాలు కూడా ఇదే నిర్ణయానికి వస్తున్నాయని అన్నారు. ప్రజలు కోరుకునే అభివృద్ధి చేయాలని కోరితే పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే దుద్దిళ్ల అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ధన్వాడ స్కూల్‌లో ఒక్క బెంచీ కూడా వేయలేదని ఆరోపించారు. అమెరికాకు వెళ్లి సొంత ఊర్లకు సేవ చేయాలని చెప్పిన దుద్దిళ్ల.. తన సొంతూరిలో ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీని అంతం చేయడానికి తన చేతులకు మట్టి అంటకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్న దుద్దిళ్ల నీచపు బుద్ధిని ప్రజలు గమనించాలని అన్నారు. ఎన్నికల్లో రూ.100 కోట్లు ఖర్చు పెట్టి, తన వద్ద ఏమీ లేవని చెబుతున్న దుద్దిళ్ల అన్నదమ్ములు హైదరాబాద్‌లో ప్యాలెస్‌లు కట్టుకున్న విషయాన్ని ప్రజలకు చూపిస్తామని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు మారాల్సిన అవసరం ఉందని, దుద్దిళ్ల అడుగులకు మడుగులు ఒత్తకుండా బానిసలుగా వ్యవహరించవద్దని పుట్ట మధూకర్ సూచించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను గౌరవించామని, కలిసి పనిచేశామని గుర్తు చేశారు. దుద్దిళ్లతో తిట్టించుకోవడానికి పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదని, రాజ్యాంగం మూలంగానే వారికి ఉద్యోగాలు వచ్చాయని, దుద్దిళ్ల కుటుంబం వల్ల కాదని గుర్తించాలన్నారు.

న్యాయబద్ధమైన కేసు పెట్టి ఉంటే సత్యనారాయణ గౌడ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారని అన్నారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని తిరిగిన రాజును ఎక్కడ పడేశారో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. పదేళ్లు వీళ్ల కోసం తాము పనిచేశామా అని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడుతున్నారని తెలిపారు. ప్రజల పక్షాన పోరాడితే న్యాయం మన పక్కనే ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ నిరూపించారని పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.



Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: