హైదరాబాద్, జూన్ 8: మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. రైతు సంక్షేమం, సింగరేణి అభివృద్ధి, ఎన్నికల హామీల అమలుపై బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వరుస ఆరోపణలు చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు అర్హులైన రైతులకు రూ.500 బోనస్ అందిస్తూ నిరంతరాయంగా ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లను పర్యవేక్షిస్తోందని చెప్పారు. హరీష్ రావు 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలను ఒకసారి పరిశీలించి, అందులోని హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. రైతుబంధుకు ఎగనామం పెట్టలేదని, అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంతోనే రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. సింగరేణిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హరీష్ రావుకు సూచించిన శ్రీధర్ బాబు, కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ వ్యతిరేక ఎంఎండీఆర్ చట్టానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపిందని ఆరోపించారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో సింగరేణి పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించడం వల్ల కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3 వంటి కీలక బొగ్గు గనులు సంస్థకు దక్కలేదని పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సింగరేణికి సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదేవిధంగా, బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బొగ్గు, విద్యుత్ బకాయిలు దాదాపు రూ.40 వేల కోట్లకు చేరాయని ఆరోపించారు. శ్రీరాంపూర్ సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 10 వేల నూతన కార్మిక క్వార్టర్లు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి పెంపు, కార్మిక సంక్షేమ చర్యలు వంటి హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పలు సంక్షేమ చర్యలు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడంతో పాటు, శాశ్వత కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమా, లాభాల వాటా పంపిణీ, బీసీ లైజనింగ్ అధికారుల నియామకం, సోలార్-థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 2014 నుంచి సింగరేణిలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రైతులు, కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Post A Comment: