ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గ్రామ స్థాయిల్లో బిజెపి నేతలు, కార్యకర్తలు ఎన్ని ఆటంకాలు కల్పిచినా, నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు ఒక యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాభీష్టానికి పెద్దపీట వేస్తూ, వారి సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకే దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హన్మకొండ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గం, ఎల్కతుర్తి మండలం, కేశవపూర్ గ్రామంలో రైతు వేదికను మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. దండేపల్లిలో ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన మొక్కలను పంపణి చేశారు. అలాగే కోతుల నడుమ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అట్లాగే రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం ఎల్కతుర్తి మండలం దామెరలో 133/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు.
ఆయా సందర్భాల్లో వేర్వేరుగా జరిగిన సభల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ అనతి కాలంలోనే దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించిందన్నారు. రైతుల కోసం కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు, 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కోతలు లేని కరెంటు, విత్తనాలు, రుణాల మాఫీ, పంటల పెట్టుబడులు, రైతు బీమా, చివరకు రైతులు ఏ కారణం చేత చనిపోయినా, వారం రోజుల్లోనే ఇంటికి 5 లక్షల రూపాయల చెక్కులు అందచేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఒక్క రైతు కోసం ఇన్ని చేస్తున్న ప్రభుత్వం రైతు వేదికల ద్వారా రైతులకు పంటలు, వాటి మార్కెటింగ్ వంటి పలు అంశాలు చర్చించుకునే విధంగా రైతు వేదికలు, రైతుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా రైతు కల్లాలు, చివరకు పంటల కొనుగోలు దాకా రైతుల కోసం పని చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వ పథకాల వల్ల మన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోతే, ప్రధాని మోడీ, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రజలు ఇవన్నీ గమనించాలన్నారు.
అలాగే, రైతు బాగుపడాలని, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎయువసం బాగుపడనే, రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వారిని వివిధ లాభదాయక వాణిజ్య పంటల సాగు వైపు మళ్ళించిన ఘనత కూడా సిఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. అందుకే ఆయిల్ పామ్ పంటలను బాగా వేయాలని, ఇందుకు సబ్సిడీని ఇస్తూ, డ్రిప్ ఇరిగేషన్ ను కూడా అందచేస్తున్నామని మంత్రి వివరించారు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, గాంధీజీ మాటలను నిజం చేస్తూ పల్లె ప్రగతి వంటి పథకాలను పెట్టి, సిఎం కెసిఆర్ , పల్లెలను సర్వతోముఖంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో 20 అత్యున్నత గ్రామాలను ఎంపిక చేస్తే, అందులో 19 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయన్నారు. ఇవ్వాళ తెలంగాణ పల్లెలు దేశానికి పట్టుగొమ్మల్లా నిలిచాయని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, సిసి రోడ్లు, మౌలిక వసతులు, పచ్చదనం, పరిశుభ్రత, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఇలా ఇన్ని పథకాలు ఎక్కడా లేవన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపడిందని, నిరంతరం జరుగుతున్నదని, అంతేగాక, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలో ఫైనాన్స్ కమిషన్‌కు సమానంగా నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈ నిధులతో గ్రామాలు ఇవ్వాళ అన్ని రంగాల్లో ముందున్నాయన్నారు.
అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్లు, బతుకమ్మ చీరల పంపిణీ, ప్రభుత్వమే పండుగలు నిర్వహించడం, ముస్లీం, క్రిస్టియన్ మైనార్టీలకు బట్టలు పెట్టడం, అసరా పెన్షన్లు, మానవీయతతో ఎయిడ్స్, బోధకాలు, ఒంటరి మహిళలు, డయాలిసిస్ పేషంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు. ఆయా పథకాలను, ఆయా గ్రామాల్లో అందుతున్న వివరాలను మంత్రి సభల్లో చదివి ప్రజలకు వివరించారు. మనిషి కడుపులో పడ్డప్పటి నుండి మనిషి మరణాంతరం వరకు కూడా ఏదో ఒక ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికీ అందుతున్నదని, ఈ విధంగా ప్రణాళికా బద్ధంగా సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని, ఇలాంటి సిఎం మనకు దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి వివరించారు. మనమంతా సిఎం కెసిఆర్ కి అండదండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ కులపతి ప్రవీణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.