August 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం అశోక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ శాఖ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌ను గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మద్దులపల్లి సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, బుర్రి శివరాజ్, సాంబయ్య, శంకర్, బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షుడు అస్రార్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, చంద్రుపల్లి సర్పంచ్ గురుసింగ బాపు, కుదురుపల్లి సర్పంచ్ సమ్మిరెడ్డి, కోట సమ్మన్న, సురేందర్, బాపురెడ్డి, కొట్టే రవీందర్, దుర్గయ్య, బానయ్య, సడవలి తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీషపై హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద దారుణంగా కొట్టి అత్యాచారం చేసి హత్య చేయడాన్ని కుల సంఘాల జేఏసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

సత్వర న్యాయం చేయాలి

ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నర్సింగ్ సిబ్బందిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శిరీష రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం అత్యంత ఘోరమైన చర్య అని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా కో-కన్వీనర్ రామగిరి రాజు మాట్లాడుతూ.. బాధితురాలి బట్టలు చిరిగిపోయి, ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు ఆమె మిత్రులు చెబుతున్నారని తెలిపారు. దీనికి కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మహిళల భద్రతపై ఆందోళన

ప్రజాసేవ చేసే నర్సులు, ఉద్యోగినుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లోనే కాకుండా వారి నివాసాల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పోరాటం కొనసాగిస్తాం

‘జస్టిస్ ఫర్ శిరీష’ పేరుతో బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని పీక కిరణ్ స్పష్టం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: కాటారం మండలంలోని విలాసాగర్, కొత్తపల్లి, మద్దులపెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

విలాసాగర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా పూసల శశికాంత్, ఉపాధ్యక్షులుగా మురుకుంట్ల స్వామి, వీరబోయిన రాజసాగర్, ప్రధాన కార్యదర్శిగా తిపిరి రమేష్, కార్యదర్శులుగా అట్టేం సత్తయ్య, మంచినీళ్ల సంపత్, బోగే లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆరేళ్ల సమ్మయ్యను నియమించారు.

విలాసాగర్ యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా రాజునాల నాగరాజు, ఉపాధ్యక్షులుగా గుంజి ఆంజనేయులు, మంచినీళ్ల స్వామి, ప్రధాన కార్యదర్శిగా శెనిగల లక్ష్మణ్, కార్యదర్శిగా తిపిరి మహేష్, కోశాధికారిగా రాజీనాల అంజిని నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్ తెలిపారు.

మద్దులపెల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ: గౌరవ అధ్యక్షుడిగా డోలి రామకృష్ణ, అధ్యక్షుడిగా మల్లారం మహేష్, ఉపాధ్యక్షులుగా టంగుటూరి శ్రావణ్, డోలి సతీష్, ప్రధాన కార్యదర్శులుగా గజ్జెల స్వామి, గోగు రాజబాపు, కార్యదర్శులుగా పాడి అశోక్, కొత్తపల్లి బాను ప్రకాష్, జనగాం కిష్టయ్య, కోశాధికారిగా పిట్టల రాజబాపును నియమించారు.

కొత్తపల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ: అధ్యక్షుడిగా అజ్మీరా నాగరాజు, ఉపాధ్యక్షుడిగా తుమ్మ అజయ్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం అభిషేక్ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తెప్పల దేవేందర్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి గడపగడపకు చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి అంగజాల అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వంశి వర్ధన్ రావు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిటూరి మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా ముగ్గు పోసి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన గృహ నిర్మాణాన్ని ప్రారంభించే సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు శుభ ముహూర్తంలో భూమిపూజ చేపట్టారు. దీంతో తమ సొంతింటి కల నెరవేరబోతుండటంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం వాస్తవ్యులు, వాస్తు నిపుణులు లక్ష్మీరాజు చార్యులు, కేశబోయిన సమ్మయ్య చారి, జాదరావుపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోట అశోక్, బొద్దుల సతీష్, బద్ది వెంకటేష్, పొరండ్ల రమేష్తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావడంతో 5వ వార్డులో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకం ద్వారా సొంతింటి కల సాకారం అవుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం ఎక్స్‌రోడ్ వద్ద అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు దినాలను ఆసరాగా చేసుకుని నిర్మాణ పనులు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంగారం ఎక్స్‌రోడ్ పరిసరాల్లో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అనుమతులు సాధ్యమా? ఒకవేళ అనుమతులు ఉంటే వాటిని ఎవరు మంజూరు చేశారు? నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను అధికారులు బహిరంగంగా వెల్లడిస్తారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

పత్రికల్లో కథనాలు వచ్చినా.. ఆగని నిర్మాణాలు

ఇప్పటికే గంగారం ఎక్స్‌రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై పలుమార్లు పత్రికల్లో కథనాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ నిర్మాణ పనులు నిలిచిపోకుండా మరింత వేగంగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. గతంలోనే సమస్య అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలపై మరో నిర్మాణం చేపడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

“అడ్డుకునేవారు ఎవరూ లేరా?”

గంగారం ఎక్స్‌రోడ్ వద్ద వరుసగా నిర్మాణాలు వెలుస్తుండటంతో “అక్రమ నిర్మాణాలను అడ్డుకునే అధికారం ఉన్న అధికారులు ఎక్కడ?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే వెంటనే పనులను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ స్థాయిలో ఎలాంటి అనుమతులు ఇచ్చారు? ఇచ్చి ఉంటే ఏ భూమికి, ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారు? ప్రభుత్వ లేదా అసైన్డ్ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సర్పంచ్ అండదండలున్నాయనే ఆరోపణలు.

ఈ నిర్మాణాలకు గ్రామపంచాయతీ సర్పంచ్ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత సర్పంచ్ లేదా గ్రామపంచాయతీ అధికారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ఆరోపణలు నిజమా? కాదా? అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికారులదేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత ప్రభావాలకు తావులేకుండా భూముల రికార్డులు, నిర్మాణ అనుమతులు, సంబంధిత పత్రాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని కోరుతున్నారు.

అధికారుల మౌనం ఎందుకు?

ఒకవైపు ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం ఉన్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? సెలవు రోజుల్లో నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నా సంబంధిత సిబ్బంది ఎందుకు తనిఖీలు చేయడం లేదు? గతంలో వచ్చిన ఫిర్యాదులు, పత్రికా కథనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమగ్ర విచారణకు డిమాండ్.

గంగారం ఎక్స్‌రోడ్ వద్ద జరుగుతున్న నిర్మాణాలపై తక్షణమే సమగ్ర క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాలు ఏ భూమిలో జరుగుతున్నాయి? భూమి స్వభావం ఏమిటి? సంబంధిత వ్యక్తుల వద్ద పట్టాలు లేదా హక్కు పత్రాలు ఉన్నాయా? గ్రామపంచాయతీ నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగి ఉంటే వెంటనే గుర్తించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. గంగారం ఎక్స్‌రోడ్‌లో వరుసగా వెలుస్తున్న నిర్మాణాల వెనుక అసలు కథేంటి? నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నాయా? అధికారుల అనుమతులు ఉన్నాయా? ఆరోపణల్లో వాస్తవమెంత? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు ఇచ్చే సమాధానాలపై ఇప్పుడు స్థానికుల దృష్టి నెలకొంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం: తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలందించిన గిడుగు రామమూర్తి పంతులు, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు రంగురంగుల అలంకరణలతో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ విద్యార్థినులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలుగు భాష ప్రాముఖ్యత, సంస్కృతి, సాహిత్య గొప్పతనాన్ని వివరించారు. క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. క్రీడల్లో విద్యార్థినులు మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉపాధ్యాయినీలు, ప్రత్యేకాధికారిణి ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా పూర్తిగా తెలుగులోనే ప్రసంగించడం విశేషంగా నిలిచింది. తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని కేజీబీవీ కాటారం ప్రిన్సిపాల్ చల్ల సునీత సూచించారు. అలాగే విద్యార్థినులు క్రీడల్లో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు ఉపాధ్యాయిని సరిత, శారీరక విద్యా ఉపాధ్యాయిని రాజేశ్వరి, ఉపాధ్యాయినీలు నళిని, సుజాత, అరుణ, మౌనిక తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం, నాయకులు మూడేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శల వెనుక కుట్రలు ఉన్నాయని తేలిపోయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్‌ రీసెర్చ్‌ సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందాల నివేదికలు కాంగ్రెస్‌ ఆరోపణలను పటాపంచలు చేశాయని ఆయన పేర్కొన్నారు. మంథని మండలం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బ్యారేజీ వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి బుధవారం పుట్ట మధూకర్‌, భూపాలపల్లి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణితో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత దానిని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పుట్ట మధూకర్‌ ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిపై ప్రశ్నించకుండా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ఉండిపోయారని విమర్శించారు.

చెక్‌డ్యాంలు, బ్రిడ్జిలపై విమర్శలు

తండ్రి, కొడుకులు మంథని నియోజకవర్గాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించినప్పటికీ ఒక్క చెక్‌డ్యాం, ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదని పుట్ట మధూకర్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బొక్కలవాగుపై చెక్‌డ్యాంలు, గోదావరిపై బ్రిడ్జిలు నిర్మించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన సమయంలో మత్స్య సంపద పెరిగిందని, భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల మత్స్యకారులు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద పెరగడంతో గతంలో దుబాయ్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు తిరిగి స్వగ్రామాలకు వచ్చారని పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోవడంతో ఉపాధి లేక ప్రజలు మళ్లీ వలసబాట పడుతున్నారని ఆరోపించారు. సుందిళ్ల బ్యారేజీ విషయంలో నిపుణుల సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందం సూచనలు చేసినప్పటికీ నీటిని నిల్వ చేయకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలపై మమకారం పెరగలేదని పుట్ట మధూకర్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయాలని, లేదంటే ప్రజలే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుందని పుట్ట మధూకర్‌ హెచ్చరించారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు ఫెర్టిలైజర్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వివరాల ప్రకారం.. యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.267 ఉండగా, కొన్ని దుకాణాల్లో రూ.320 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే రూ.1,350 ధర ఉండాల్సిన డీఏపీని రూ.1,850 వరకు విక్రయిస్తున్నారని పేర్కొంటున్నారు. అధికారిక యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుని కొనుగోలు చేసినప్పటికీ అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఒక్కో దుకాణంలో ఒక్కో ధర.

ఎరువులతో పాటు పంటలకు వినియోగించే పురుగుమందులు, స్ప్రే మందులను కూడా ఒక్కో దుకాణంలో ఒక్కో ధరకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ధరలపై ప్రశ్నించినప్పుడు కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు చేపట్టాలి.

ఎరువులు, పురుగుమందులను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. ప్రతి ఫెర్టిలైజర్‌ దుకాణంలో అన్ని ఉత్పత్తుల ధరలు స్పష్టంగా కనిపించేలా రేట్‌ బోర్డులు ఏర్పాటు చేయించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆయన అధికారులను కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 24: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్ల (CRT) నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇతర జిల్లాల వారికి అవకాశం కల్పిస్తున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ పీక కిరణ్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహాదేవపూర్‌ మండలాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 20 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని కిరణ్‌ ఆరోపించారు. వారికి భూపాలపల్లి జిల్లా నుంచి జీతాలు చెల్లిస్తూ, ఇతర జిల్లాల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అలాగే మేడిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ నియామకంలోనూ నిబంధనలు పాటించలేదని జేఏసీ ఆరోపించింది. 50 ఏళ్లు నిండని పురుష ఉపాధ్యాయుడైన ఎం. చంద్రశేఖర్‌రెడ్డికి హెడ్‌మాస్టర్‌ బాధ్యతలు అప్పగించారని, అదే పాఠశాలలో సీనియర్‌ మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నప్పటికీ నిబంధనలను పక్కనబెట్టారని పేర్కొంది. ఇక కాళేశ్వరం ఆశ్రమ పాఠశాల బాలికల వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని జేఏసీ ఆరోపించింది. పోషకాహారం సరిగా అందక విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. గతంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మందికి పడిపోయిందని తెలిపింది. మహాదేవపూర్‌లోని బాలికలు, బాలుర వసతిగృహాల్లోనూ మెనూ అమలుపై ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఇతర జిల్లాల వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం స్థానికుల హక్కులను కాలరాయడమేనని పీక కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్‌-లోకల్‌ సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేసి, నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, అవసరమైన సౌకర్యాలు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని ఆ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


దూదేకులపల్లి గ్రామానికి చెందిన నీలారపు రాజబాబు అనారోగ్యంతో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా రవి పటేల్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.


చిట్యాల మండలంలో ఇటీవల దాడికి గురైన జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌ను ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడించి రవీందర్‌కు ధైర్యం కల్పించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


టేకుమట్ల మండలం కలికోటపల్లి గ్రామంలో టీఆర్పీ నాయకుడు కొలని సదయ్య కుమార్తె రవళి–ప్రశాంత్‌ల వివాహానికి హాజరైన రవి పటేల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. దూతుపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు శస్త్రచికిత్స చేయించుకున్న లక్కాకుల హరీష్‌ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



చిట్యాల మండలం గోపాల్పూర్‌లో ఇటీవల మృతి చెందిన దుప్పటి సారయ్య కుటుంబాన్ని నాలుగో రోజు పరామర్శించిన రవి పటేల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా సహకరించడం, ప్రమాద బాధితులకు ధైర్యం కల్పించడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత అన్నారు. కార్యక్రమాల్లో సాదు మల్లన్న ముదిరాజ్, టీఆర్పీ నాయకులు ఇనుగల ప్రణయ్ రాజ్, పిట్టల వెంకటేష్, మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మద్దులపల్లి, ఆగస్టు 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్‌డీఏ ద్వారా అందిన బాంబూ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పన్నాల కేతక్క, స్వరూప, రాజక్కలకు బాంబూ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిత మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తున్న బాంబూ మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్తులో రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే వీబిజి రామ్ పథకం ద్వారా రైతులకు 15 గంటల పనికి దాదాపు రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని సర్పంచ్ సరిత తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్ కోరారు. గ్రామీణ ప్రాంత రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఐకెపి సీసీ శశికాంత్, వార్డు మెంబర్ సంతోష్, వీఓఏ మొండయ్య, నాయకులు సురేందర్, సమ్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జాదరావుపేట, ఆగస్టు 21: జాదరావుపేట గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. రేషన్ డీలర్ కటుక సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ బండి సువర్ణ–రమేష్, ఉప సర్పంచ్ కోట అశోక్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని స్వాగతిస్తున్నామని, డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రజలు సకాలంలో కార్డులు పొందాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాజా, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోట్ల బక్కమ్మ–ఎల్లయ్య, పోట్ల పోషయ్య, ఎండీ అజారుద్దీన్, కోట రమేష్, బండి శ్రీధర్‌తో పాటు లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 21: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు, హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 23న వరంగల్ ప్రెస్ క్లబ్, హనుమకొండలో బహిరంగ చర్చావేదిక నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కాటారంలో కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరత్వం పొందినవారు, జైలు శిక్షలు అనుభవించినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, గాయపడినవారు, మానసిక వేధింపులకు గురైనవారు ఎంతోమంది ఉన్నారని కిరణ్ పేర్కొన్నారు. ఉద్యమ కేసుల కారణంగా ఇప్పటికీ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి తగిన గుర్తింపు, సహాయం, సంక్షేమం అందాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజాసంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు, వివిధ కుల సంఘాలు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను చర్చావేదికలో వెల్లడించి, ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి నివేదిక రూపంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంథని సంజీవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ముఖ్య వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం పాల్గొంటారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చర్చావేదికను విజయవంతం చేయాలని కిరణ్ కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి, రాష్ట్ర నాయకులు కామర గట్టయ్య, అయితే బాపు, బూడిది లావణ్య, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 20: భూపాలపల్లిలోని ఎస్‌ఆర్‌డీజీ స్కూల్లో ఇన్వెస్టిట్యూర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకుడికి క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత ప్రవర్తన, ఇతరులను గౌరవించే గుణం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అవసరమని తెలిపారు. నాయకత్వం అంటే అధికారం కాదని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవడమేనని సూచించారు. అనంతరం నూతనంగా ఎంపికైన విద్యార్థి నాయకులకు సాష్‌లు ధరింపజేసి బాధ్యతలను అప్పగించారు. నాయకులు తమ బాధ్యతలను క్రమశిక్షణ, నిబద్ధతతో నిర్వహిస్తూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని నూతన నాయకులకు అభినందనలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం: అటవీ హక్కుల చట్టం–2006లో ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు (OTFD) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహాముత్తారం మండల అధ్యక్షుడు రామగిరి రాజు వినతిపత్రం అందజేశారు. OTFDలకు వర్తించే మూడు తరాలు లేదా 75 సంవత్సరాల నిబంధనను సడలించేలా చట్ట సవరణకు సిఫారసు చేయాలని కోరారు. పాతకాలంలో సరైన రెవెన్యూ, అటవీ, సర్వే రికార్డులు అందుబాటులో లేకపోవడంతో నిజమైన అటవీ నివాసితులు 75 ఏళ్ల నిరంతర చారిత్రక ఆధారాలు సమర్పించలేక హక్కులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. చట్ట సవరణ జరిగే వరకు OTFDలను తొలగింపులు, వేధింపుల నుంచి రక్షించేలా జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, AIAYS మండల గౌరవ అధ్యక్షుడు లింగమళ్ల సడవలిరావు, సలహాదారు గంధం రాజేష్, ప్రధాన కార్యదర్శి లింగమళ్ల శంకర్, ప్రచార కార్యదర్శి పులియాల సురేష్ పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కోశాధికారి జినుకల శ్రీను భార్య దివ్య కుటుంబాన్ని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జిల్లా నాయకులతో కలిసి పరామర్శించారు. తలలో కణితితో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దివ్య మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఇద్దరు కుమార్తెల చదువులకు భవిష్యత్తులో సహకరిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జినుకల శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలను త్వరలో కలసి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా నాయకులు, కమలాపూర్ గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 20: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంపై ఈ నెల 23న హనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ చర్చ వేదికను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ పిలుపునిచ్చారు. గురువారం భూపాలపల్లిలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో బహిరంగ చర్చ వేదిక కనపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కె. కేశవరావు చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హనుమకొండ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ వేదిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాచమౌని నాగభూషణం అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములునాయక్, ఉద్యమకారుల కమిటీ సభ్యుడు శోభన్‌రెడ్డి, ప్రొఫెసర్ చింతకింది కాసిం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొంటారని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర గట్టయ్య, టీపీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ పార్వతి, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఐత బాపు, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, ఆగస్టు 19: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనలు పేద లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ అన్నారు. నిబంధనలు సవరించకపోతే లబ్ధిదారుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం ప్రస్తుత నిర్మాణ ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. సిమెంట్, ఇనుము, కూలీల ధరలు పెరిగిన నేపథ్యంలో నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటి వైశాల్య పరిమితిని 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. అరకొర ఆర్థిక సాయంతో పేదలు అప్పులు చేసి ఇళ్లు నిర్మించాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు పీక కిరణ్ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి నిబంధనలు సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

భూపాలపల్లి, ఆగస్టు 19: రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్‌లో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న ఆదివాసీలు, ఉద్యమకారులు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కామెరా గట్టయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, ప్రజా ఫ్రంట్ దుబాసి పార్వతి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య నాయకుడు అయిత బాపుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహాముత్తారం, ఆగస్టు 19: మహాముత్తారం మండలం కోనంపేటలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్‌లో 60–80 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించడం లేదని, జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై జూలై 27, ఆగస్టు 3, ఆగస్టు 17న జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. భూపాలపల్లి టౌన్ ఎల్‌బీనగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ కుమారస్వామి, నందిగామకు చెందిన ప్రభాకర్ గౌడ్‌తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా టీఆర్పీలో చేరుతున్నట్లు నూతన నాయకులు తెలిపారు. తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలు తమను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. పటేల్ వనజ మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో మరింత మంది ప్రజలు టీఆర్పీలో చేరి రాజ్యాధికారం దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాధికారం సాధించేందుకు పార్టీ కృషి చేస్తోందన్నారు. రవి పటేల్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రణీత్, సంతోష్, శ్రీకాంత్, రాంబాబు తదితరులు, టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మహా ముత్తారం, ఆగస్టు 19: మహా ముత్తారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కాటారం డివిజన్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు చర్చించారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, మొక్కల సంరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు పాలకవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత పొందిన 15 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేస్తామని, మధ్యవర్తులు, సిఫార్సులు అవసరం లేదని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day


మహాముత్తారం, ఆగస్టు 18: గ్రామపంచాయతీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారని ఆరోపిస్తూ బీజేపీ మండల ఉపాధ్యక్షుడు లింగమల్ల సడవలిరావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మార్క బాపు సొంత భూమికి ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడని ప్రాంతంలో, ఇరువైపులా చెట్లు మాత్రమే ఉన్న చోట సీసీ రోడ్డు నిర్మించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాల్సి ఉండగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోడ్లు వేయడం సరికాదన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన తీర్మానాలపై సంతకాలు చేయవద్దని, సంబంధిత బిల్లులను చెల్లించవద్దని సడవలిరావు కోరారు. ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్డుపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం ప్రజల అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 18: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. తిరుపతి పిలుపునిచ్చారు. మంగళవారం డీటీఎఫ్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా మూడో దశలో నిర్వహిస్తున్న జిల్లా కేంద్రం ధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు ఆరో డీఏను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో నంబర్ 190ను వెంటనే అమలు చేయాలని కోరారు. జీవో నంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల పనివేళలను ఉదయం 9 గంటలకు మార్చాలని, ప్రతి గురుకుల పాఠశాలలో సంరక్షకులు, వసతి గృహ నిర్వాహకులను నియమించాలని కోరారు. మోడల్ పాఠశాలల్లోనూ వసతి గృహ నిర్వాహకులను నియమించాలని, 010 పద్దు కింద వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అతిథి ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణిని అమలు చేయాలని, కేజీబీవీ పాఠశాలల్లో రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మరుసటి రోజు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల మిగతా సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి మోహన్ నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ నాయక్, జిల్లా కౌన్సిలర్ రాజన్నతో పాటు పనిందర్, నర్సన్న, కవిత తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, ఆగస్టు 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు, గీత కార్మికులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్ర, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో  మారగోని శంకర్ గౌడ్ – గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, అరిగేళ్ల వెంకటరాజ్యం – జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి సమ్మయ్య గౌడ్ కరెంగాల తిరుపతి గౌడ్ – గౌడ జన హక్కుల సంఘం పోరాట సమితి, పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గౌడ కులస్తులు, గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. గీత కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి అందించడంతో పాటు, ఆయన చూపిన బాటలో సామాజిక న్యాయం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మంథని, ఆగస్టు 18: కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంథనిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా రాజగృహా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు చౌరస్తాలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అక్కడే ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో కొత్త తరహా పాలనకు తెరలేపి, పథకాలు కోర్టుల ద్వారా ఆగిపోతున్నాయంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా కొత్తగా ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని, ఉన్న పథకాలను కూడా రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేయించినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్లు దాఖలు చేయడం లేదని అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. 420 హామీలపై పలుమార్లు ప్రశ్నించినా ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో దాడులు, కేసులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని పుట్ట మధూకర్‌ ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని, అలాంటి కేసులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేస్తూ.. ప్రజలతో బీఆర్‌ఎస్‌కు పేగు బంధం ఉందన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఆడబిడ్డల ఆత్మగౌరవమే కళ్యాణలక్ష్మి: జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌

పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు కళ్యాణలక్ష్మి పథకం నిలువెత్తు నిదర్శనమని భూపాలపల్లి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కుల మంజూరులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. పథకంపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో కౌంటర్‌ దాఖలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ నిధులు విడుదల చేసే వరకు మహిళా లోకం పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు. 

పథకాలు రద్దు చేసే ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి: పుట్ట శైలజ


పేద ప్రజల సంక్షేమం కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని మంథని మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. అలాంటి పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కళ్యాణలక్ష్మి వంటి పథకాలను కొనసాగించేందుకు పేదింటి ప్రజలు, మహిళలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మంథనిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఉందని పుట్ట శైలజ అన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.