కాటారం, ఆగస్టు 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘాల నాయకులు, గీత కార్మికులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్ర, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో మారగోని శంకర్ గౌడ్ – గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, అరిగేళ్ల వెంకటరాజ్యం – జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి సమ్మయ్య గౌడ్ కరెంగాల తిరుపతి గౌడ్ – గౌడ జన హక్కుల సంఘం పోరాట సమితి, పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గౌడ కులస్తులు, గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. గీత కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి అందించడంతో పాటు, ఆయన చూపిన బాటలో సామాజిక న్యాయం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post A Comment: