కాటారం, ఆగస్టు 18: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. తిరుపతి పిలుపునిచ్చారు. మంగళవారం డీటీఎఫ్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. దశలవారీ పోరాట కార్యక్రమంలో భాగంగా మూడో దశలో నిర్వహిస్తున్న జిల్లా కేంద్రం ధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయడంతో పాటు ఆరో డీఏను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో నంబర్ 190ను వెంటనే అమలు చేయాలని కోరారు. జీవో నంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల పనివేళలను ఉదయం 9 గంటలకు మార్చాలని, ప్రతి గురుకుల పాఠశాలలో సంరక్షకులు, వసతి గృహ నిర్వాహకులను నియమించాలని కోరారు. మోడల్ పాఠశాలల్లోనూ వసతి గృహ నిర్వాహకులను నియమించాలని, 010 పద్దు కింద వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, అతిథి ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణిని అమలు చేయాలని, కేజీబీవీ పాఠశాలల్లో రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మరుసటి రోజు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయుల మిగతా సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు రాజు నాయక్, ప్రధాన కార్యదర్శి మోహన్ నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ నాయక్, జిల్లా కౌన్సిలర్ రాజన్నతో పాటు పనిందర్, నర్సన్న, కవిత తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: