మంథని, ఆగస్టు 18: కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంథనిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా రాజగృహా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళలు చౌరస్తాలో బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అక్కడే ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో కొత్త తరహా పాలనకు తెరలేపి, పథకాలు కోర్టుల ద్వారా ఆగిపోతున్నాయంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా కొత్తగా ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని, ఉన్న పథకాలను కూడా రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేయించినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో కౌంటర్లు దాఖలు చేయడం లేదని అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. 420 హామీలపై పలుమార్లు ప్రశ్నించినా ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో దాడులు, కేసులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని పుట్ట మధూకర్ ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని, అలాంటి కేసులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేస్తూ.. ప్రజలతో బీఆర్‌ఎస్‌కు పేగు బంధం ఉందన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవమే కళ్యాణలక్ష్మి: జక్కు శ్రీహర్షిణీ రాకేష్
పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆర్థిక భరోసాకు కళ్యాణలక్ష్మి పథకం నిలువెత్తు నిదర్శనమని భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కుల మంజూరులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. పథకంపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ నిధులు విడుదల చేసే వరకు మహిళా లోకం పోరాటం కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
పథకాలు రద్దు చేసే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి: పుట్ట శైలజ
పేద ప్రజల సంక్షేమం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని మంథని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ అన్నారు. అలాంటి పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి వంటి పథకాలను కొనసాగించేందుకు పేదింటి ప్రజలు, మహిళలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మంథనిలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై ఉందని పుట్ట శైలజ అన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



Post A Comment: