కాటారం, ఆగస్టు 24: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్ల (CRT) నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇతర జిల్లాల వారికి అవకాశం కల్పిస్తున్నారని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌ పీక కిరణ్‌ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. మంథని నియోజకవర్గ పరిధిలోని మహాముత్తారం, కాటారం, మహాదేవపూర్‌ మండలాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 20 మందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని కిరణ్‌ ఆరోపించారు. వారికి భూపాలపల్లి జిల్లా నుంచి జీతాలు చెల్లిస్తూ, ఇతర జిల్లాల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అలాగే మేడిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్‌ నియామకంలోనూ నిబంధనలు పాటించలేదని జేఏసీ ఆరోపించింది. 50 ఏళ్లు నిండని పురుష ఉపాధ్యాయుడైన ఎం. చంద్రశేఖర్‌రెడ్డికి హెడ్‌మాస్టర్‌ బాధ్యతలు అప్పగించారని, అదే పాఠశాలలో సీనియర్‌ మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నప్పటికీ నిబంధనలను పక్కనబెట్టారని పేర్కొంది. ఇక కాళేశ్వరం ఆశ్రమ పాఠశాల బాలికల వసతిగృహంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదని జేఏసీ ఆరోపించింది. పోషకాహారం సరిగా అందక విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. గతంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మందికి పడిపోయిందని తెలిపింది. మహాదేవపూర్‌లోని బాలికలు, బాలుర వసతిగృహాల్లోనూ మెనూ అమలుపై ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఇతర జిల్లాల వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం స్థానికుల హక్కులను కాలరాయడమేనని పీక కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్‌-లోకల్‌ సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేసి, నియామకాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, అవసరమైన సౌకర్యాలు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: