మహాముత్తారం, అక్టోబర్ 3 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రహదారుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్కరాము గౌడ్ ఆరోపించారు. రహదారులపై ఏర్పడిన గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం మహాముత్తారంలో స్థానిక విలేకరులతో నిర్వహించిన పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బోడ బాలాజీ నాయక్‌తో కలిసి మార్కరాము గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలోని రహదారుల దుస్థితితో పాటు స్థానిక సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మండలంలోని కొర్లకుంట నుంచి జీలపల్లి వరకు, నారపచెట్టు నుంచి మహాముత్తారం వరకు ఉన్న బీటీ రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారాయని తెలిపారు. అదేవిధంగా నిమ్మగూడెం–సింగినంపల్లి–యెత్నారం, బోర్లకుడెం–మీనాజిపేట–నర్సింగాపూర్, నర్సింగాపూర్–మీనాజిపేట, పెగడపల్లి–ప్రేమ్‌నగర్, పోలారం–ఊట్లపల్లి రహదారులు కూడా అధ్వానంగా తయారయ్యాయని పేర్కొన్నారు.

రహదారులు దెబ్బతినడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రోగులు, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో రహదారుల దుస్థితి కారణంగా ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పారు.

వాహనాలు తరచూ గుంతల్లో పడుతూ మరమ్మతులకు గురవుతున్నాయని, నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్కరాము గౌడ్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ మహాముత్తారం మండల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు. గత మూడేళ్లలో మంత్రి మండలానికి ముచ్చటగా మూడు సార్లు మాత్రమే అధికారికంగా పర్యటించారని ఆరోపించారు.

మండల అభివృద్ధిపై కనీసం ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించకపోవడం శోచనీయమని అన్నారు. పాత పనుల అంచనాల పెంపు, నీతి ఆయోగ్, అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని విమర్శించారు. మండలంలో కొత్త సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.

మహాముత్తారం మండలంలో దెబ్బతిన్న అన్ని ప్రధాన రహదారులను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా మండలంలోని విద్యా, వైద్య రంగాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

స్థానికంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మండలంలో కొత్త పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం, సంబంధిత మంత్రి వెంటనే స్పందించి మహాముత్తారం మండలంలోని రహదారుల సమస్యను పరిష్కరించాలని మార్కరాము గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జైపాల్ నాయక్, పోలారం సర్పంచ్ అంబాల రాజబాబు, నిమ్మగూడెం సర్పంచ్ జాడి రాజేష్, బోడ బాలాజీ, వెంకటస్వామి, సోనాలి సమ్మయ్య, రత్నం పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: