జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులే ప్రధాన ఆధారమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్ల నారాయణ రెడ్డి, కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ అన్నారు. కాటారం సబ్‌డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు వీఎల్‌జీ–రామ్‌జీ (VBG–RAM JI) పథకం ద్వారా 2036–27 ఆర్థిక సంవత్సరానికి రూ.12.58 కోట్ల అభివృద్ధి నిధులు కేటాయించిన సందర్భంగా మంగళవారం బీజేపీ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు అందిస్తోందన్నారు. కాటారం సబ్‌డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా సంఘ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాల్సి ఉంటుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల విషయంలో జాప్యం కొనసాగితే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం కాటారం సబ్‌డివిజన్‌కు నిధులు కేటాయించడంతో ఐదు మండలాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి డోలి అర్జయ్య, మాజీ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, బండం మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోగుల రాజేష్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు కేతిరి రాజయ్య, రాజ్ నాయక్, నవీన్ నాయక్, ఎస్కే వస్తాద్, దుర్గం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: