కాటారం అక్టోబర్ 6 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (PRTUTS) జిల్లా సర్వసభ్య సమావేశంలో కాటారం మండలానికి చెందిన ఆంగోతు రవీందర్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాటారం మండల పీఆర్‌టీయూటీఎస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఆంగోతు రవీందర్‌ను ఘనంగా సన్మానించారు. మండల శాఖ నాయకులు, ఉపాధ్యాయులు రవీందర్‌కు శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టిన రవీందర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఆయన సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆంగోతు రవీందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన పీఆర్‌టీయూటీఎస్ సంఘ నాయకులకు, ఉపాధ్యాయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన కాటారం మండల శాఖ అధ్యక్షుడు అనపర్తి తిరుపతి, ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రవీందర్ తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కాటారం మండలానికి చెందిన ఉపాధ్యాయ నాయకుడు జిల్లా స్థాయి బాధ్యతకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మండల పీఆర్‌టీయూటీఎస్ నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. రవీందర్ ఎన్నికతో కాటారం మండల శాఖకు మరింత గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూటీఎస్ సంఘ ప్రతినిధులు, కాటారం మండల శాఖ నాయకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఆంగోతు రవీందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Post A Comment: