కాటారం: తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలందించిన గిడుగు రామమూర్తి పంతులు, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థినులు రంగురంగుల అలంకరణలతో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ విద్యార్థినులు పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలుగు భాష ప్రాముఖ్యత, సంస్కృతి, సాహిత్య గొప్పతనాన్ని వివరించారు. క్రీడల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. క్రీడల్లో విద్యార్థినులు మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా ఉపాధ్యాయినీలు, ప్రత్యేకాధికారిణి ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా పూర్తిగా తెలుగులోనే ప్రసంగించడం విశేషంగా నిలిచింది. తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలుగు భాషను కాపాడుకోవాలని కేజీబీవీ కాటారం ప్రిన్సిపాల్ చల్ల సునీత సూచించారు. అలాగే విద్యార్థినులు క్రీడల్లో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చల్ల సునీత, తెలుగు ఉపాధ్యాయిని సరిత, శారీరక విద్యా ఉపాధ్యాయిని రాజేశ్వరి, ఉపాధ్యాయినీలు నళిని, సుజాత, అరుణ, మౌనిక తదితరులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


Post A Comment: