కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు మూడేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శల వెనుక కుట్రలు ఉన్నాయని తేలిపోయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్ రీసెర్చ్ సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందాల నివేదికలు కాంగ్రెస్ ఆరోపణలను పటాపంచలు చేశాయని ఆయన పేర్కొన్నారు. మంథని మండలం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బ్యారేజీ వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బుధవారం పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత దానిని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పుట్ట మధూకర్ ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిపై ప్రశ్నించకుండా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ఉండిపోయారని విమర్శించారు.
చెక్‌డ్యాంలు, బ్రిడ్జిలపై విమర్శలు
తండ్రి, కొడుకులు మంథని నియోజకవర్గాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించినప్పటికీ ఒక్క చెక్‌డ్యాం, ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదని పుట్ట మధూకర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బొక్కలవాగుపై చెక్‌డ్యాంలు, గోదావరిపై బ్రిడ్జిలు నిర్మించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన సమయంలో మత్స్య సంపద పెరిగిందని, భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల మత్స్యకారులు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద పెరగడంతో గతంలో దుబాయ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు తిరిగి స్వగ్రామాలకు వచ్చారని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోవడంతో ఉపాధి లేక ప్రజలు మళ్లీ వలసబాట పడుతున్నారని ఆరోపించారు. సుందిళ్ల బ్యారేజీ విషయంలో నిపుణుల సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందం సూచనలు చేసినప్పటికీ నీటిని నిల్వ చేయకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలపై మమకారం పెరగలేదని పుట్ట మధూకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయాలని, లేదంటే ప్రజలే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుందని పుట్ట మధూకర్ హెచ్చరించారు.

Post A Comment: