భూపాలపల్లి, ఆగస్టు 19: రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఉద్యోగుల సంఘం బాతాల రాజన్న భవన్‌లో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న ఆదివాసీలు, ఉద్యమకారులు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూఏపీఏ చట్టాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు కామెరా గట్టయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, తెలంగాణ రైతు పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, ప్రజా ఫ్రంట్ దుబాసి పార్వతి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు రాదండి దేవేందర్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య నాయకుడు అయిత బాపుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Post A Comment: