మహాముత్తారం, ఆగస్టు 19: మహాముత్తారం మండలం కోనంపేటలోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. ప్లాంట్‌లో 60–80 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 16 మందితోనే పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు సెలవులు, ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించడం లేదని, జీతాల నుంచి పీఎఫ్, ఈఎస్‌ఐ, మెడిక్లెయిమ్, పెట్రోల్ అలవెన్సుల పేరుతో రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై జూలై 27, ఆగస్టు 3, ఆగస్టు 17న జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతస్థాయి విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు.

Post A Comment: