పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:అక్టోబర్:31:ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలనీ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ,అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ,కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మాట్లాడారు,ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసి,సమస్య పరిష్కరించి,సదరు వివరాలను సైతం ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.సోమవారం మొత్తం 50 అర్జీలు రాగా,వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 23,ఇతర శాఖలకు సంబంధించి 27 దరఖాస్తులు వచ్చాయని,ఎక్కువగా పెన్షన్,భూ సంభందిత సమస్యలపై అర్జీలు ఇచ్చారని తెలిపారు.గోదావరిఖని కె.సి.ఆర్.కాలనీకి చెందిన అంబాల స్రవంతి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయుటకు కోరుతూ దరఖాస్తు సమర్పించారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అర్హత మేరకు పరిష్కరించమని కలెక్టర్ సూచించారు.ముత్తారం మండలం సందరెల్లి గ్రామానికి చెందిన ఇందారపు లక్ష్మి తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న శివాలయానికి నీటి సరఫరా సౌకర్యం కొరకు దరఖాస్తు చేసుకోగా,సింగరేణి సంస్థ కు పంపుతూ నీటి సరఫరా పనులు పూర్తి చేయుటకు కలెక్టర్ సూచించారు.రామగుండం అయోధ్య నగర్ కు చెందిన కె.బక్కమ్మ తన కుమారుడు శ్రీనివాస్ వద్ద నుంచి బోర్ వెల్ మోటార్,వాషింగ్ మెషిన్,ఇతర వస్తువులు ఇప్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకోగా అదనపు కలెక్టర్ రెవెన్యూకు రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.గోదావరిఖని ప్రాంతానికి చెందిన దుర్గానగర్ కాలనీ ప్లాట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తమ లేఔట్ లో నాలా విస్తరణ కోసం కేటాయించిన 35 గుంటల స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమిస్తున్నారని, దీనిని నివారించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ నవంబర్ 7 లోపు పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.మంథని మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన పుట్ట శ్రీనివాస్ సర్వే నెంబర్ 49,162 లోని తమ పోడు భూములకు హద్దులు చూపి పట్టాలు అందజేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మంథని తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

















































