ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
రక్తదాన శిబిరంలో 201 యూనిట్ల రక్తం సేకరణ జరిగిందని, రక్త దాతలు, ప్రాణ దాతలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఆర్ ప్రధాన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు తో కలిసి ఎస్పి జె. సురేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ పోలీసు అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. థలసేమియా, క్యాన్సర్,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా దాతలకు కూడా మంచి చేకూరుతుందని ఎస్పి సురేందర్ రెడ్డి అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ అన్నారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు.
రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ యువజన సంఘాలు యువకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులను అభినందించిన ఎస్పి సురేందర్ రెడ్డి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, జానీ నరసింహులు, వాసుదేవరావు, అజయ్, జితేందర్ రెడ్డి, కిరణ్, రంజిత్ రావ్, సంతోష్, సతీష్, ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రవీణ్, జిల్లా పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Post A Comment: