June 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 29: కాటారం డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు, పోడు భూముల దందాపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొందరు అటవీ శాఖ అధికారుల ప్రమేయంతో అటవీ భూములు నాశనమవుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్, విజిలెన్స్, అటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ భూముల విక్రయాలు, ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయని, కొందరు ఫారెస్ట్ అధికారులు, స్థానిక బ్రోకర్లు కలిసి ఇతర ప్రాంతాల వ్యక్తులకు భూములను విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను మాయమాటలు చెప్పి, బెదిరింపులకు పాల్పడి స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. మహాముత్తారం మండలం నిమ్మగూడెం పరిధిలో అటవీ భూముల అక్రమ విక్రయాలపై గతంలో సీసీఎఫ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆశించిన చర్యలు కనిపించలేదని తెలిపారు. అలాగే మల్హర్ మండలంలోని కొయ్యూర్ రేంజ్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఇటీవల సస్పెన్షన్ చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలు అన్ని చోట్ల కొనసాగించాలని కోరారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోతున్నాయని, వర్షపాతం తగ్గుతూ కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ నిర్వహించి, సంబంధిత అధికారుల కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల వివరాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులైన అధికారులు, బ్రోకర్లు, ఇతర సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని గిరిజనుల పోడు భూములకు, అటవీ సంపదకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

చిదినేపల్లి, జూన్ 23: చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొప్పారం గ్రామంలో నిన్న కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల వర్షపు నీరు నిల్వ కావడంతో గ్రామపంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. గ్రామంలో నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ సమీపంలోని పైపులను తొలగించి, సైడ్ డ్రైనేజీ కాలువలను పూర్తిగా శుభ్రం చేసి నీటి ప్రవాహాన్ని సక్రమంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ కోరల్ల రాజయ్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, వార్డు సభ్యుడు మంతెన రాజశేఖర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ ఇళ్ల చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


అదేవిధంగా గ్రామంలో సెంట్రల్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి, చిదినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని సెంట్రల్ లైట్లను ఈరోజు మరమ్మతులు చేసి తిరిగి వెలిగేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ ముందంజలో ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : ఖరీఫ్-2026 సీజన్‌లో రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో కాటారం మండలంలోని రేగులగూడెం, దామరకుంట క్లస్టర్లలో మంగళవారం సీడ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు వివిధ పంటలకు సంబంధించిన నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. 


రేగులగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), దామరకుంట వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మాట్లాడుతూ రైతులు సకాలంలో విత్తనాలను సేకరించుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రగతిశీల రైతులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం, రేగులగూడెం, దామరకుంట రైతువేదికలలో ఖరీఫ్ 2026-27 సీజన్‌కు సంబంధించి "సీడ్ మేళ" కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాటారం గ్రామ సర్పంచ్  పంతకాని సడవలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  పంతకాని తిరుమల సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు  వేమునూరి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులకు వరి సాగుకు అనువైన 8 రకాల సన్న విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించి వాటిని రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ధ్రువీకరించిన విత్తనాలను వినియోగించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఖరీఫ్ సీజన్‌ను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా, జూన్ 22: బిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్దన్నపేట, పరకాల నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, 


ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పునర్వైభవం, ప్రజా సమస్యలపై పోరాటాలు, కార్యకర్తల సమన్వయం, రానున్న ఎన్నికల కార్యాచరణపై నాయకులు చర్చించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి బిఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
హనుమకొండ, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే యూనిఫార్మ్స్ అందించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టింది. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, సరైన తరగతి గదులు, ఫ్యాన్లు, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా సామగ్రి వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హనుమకొండ నగరంలో అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచే లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, జిల్లా కమిటీ సభ్యులు బొచ్చు ఈశ్వర్, ఎండి ఇస్మాయిల్, చెన్నూరి సాయికుమార్, పవన్ కుమార్, సాల్మన్ రాజ్, అభిషేక్, రణదీప్, ప్రభాస్, మల్లేష్, నాగరాజ్, సురాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పలిమెల, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన పలిమెల మండల పరిధిలో గోదావరి సరిహద్దు గ్రామాల్లో వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదన్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని వీధులు, గుంతల్లో మురుగునీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో దోమల బెడద పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంత ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఇంటికీ రెండు నుంచి మూడు దోమతెరలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. సరిహద్దు గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిరంతర నిఘా ఉంచి ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వర్షాలు కురిసే ముందే దోమతెరల పంపిణీ చేపట్టకపోతే గ్రామాలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ దాసరి రమేష్, కార్మిక సంఘ రాష్ట్ర నాయకుడు అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు దారకొండ సూర్యశంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
భూపాలపల్లి, జూన్ 21: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ సభ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సామాజిక, రాజకీయ అభ్యున్నతే రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందాలని, బహుజన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటే ప్రజలు పెద్ద ఎత్తున జూలై 5న జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, ప్రస్తుతం కొందరి చేతుల్లో నలిగిపోతోందని విమర్శించారు. రెడ్డి, వెలమ ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి, బహుజన వర్గాలకు రాజ్యాధికారం సాధించాల్సిన సమయం ఆసన్నమైందని రవి పటేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటపోతుల సమ్మయ్య, మడే సంతోష్, జినుకల శ్రీను, అశోక్, కృష్ణ ప్రశాంత్, శ్రీపతి, భద్రయ్య, రంజిత్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 20: తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం-1923లోని సెక్షన్ 5, 6 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శనివారం గ్రామ రీ-సర్వేకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో రీ-సర్వే ప్రక్రియ, భూ సరిహద్దుల నిర్ధారణ, సర్వే సమయంలో రైతులు, భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు. 


రీ-సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజల సహకారం అవసరమని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), తహసీల్దార్, సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), పంచాయతీ కార్యదర్శి  (పీఎస్), గ్రామ పెద్దలు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
మహాదేవపూర్, జూన్ 19: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని ఓర్వలేక కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దేవాలయ అభివృద్ధి పనులపై అవాస్తవ ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేవస్థాన అభివృద్ధి కోసం టెండర్ ప్రక్రియ ప్రారంభం కాకముందే రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. భక్తుల సహకారం, ప్రభుత్వ నిబద్ధతతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పవిత్ర క్షేత్రాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని తెలిపారు. 

లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మెడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యలు, కుట్రలు, భూదందాలు, రౌడీయిజం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మహాదేవపూర్ ప్రాంత ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అఫ్జల్ ప్రకాశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, గ్రామ సర్పంచ్ హసీనా బానో, ఎక్స్‌పీఎస్సీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, రామన్ రావు, తిరుపతిరెడ్డి, శంకరయ్య, శివరాజు, సంతోష్, మోత సాంబయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కోట సమ్మయ్య, వార్డ్ సభ్యులు గడ్డం స్వామి, నయూముద్దీన్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 
కాటారం, జూన్ 18 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు చల్ల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కాటారం మండల ఉపాధ్యక్షుడు చీర్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమై ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజల తరఫున పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్, నాయకులు బండము మల్లారెడ్డి, గోగుల రాజేష్, కొండ రామ్, వార్డు సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, జిలేష్, గండు మల్లారెడ్డి, గండు తిరుపతి, చీర్ల చంద్రశేఖర్, వడ్ల రవీంద్రాచారి, సురేష్, రత్నాకర్, నరేష్, జగదీష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), బీఎల్‌వో పర్యవేక్షకులకు కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాటారం రెవెన్యూ డివిజనల్ అధికారి, కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు తహసీల్దార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ అమలు విధానం, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ, క్షేత్రస్థాయి బాధ్యతలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర అవగాహన కల్పించారు. మూడు మండలాలకు చెందిన బీఎల్‌వోలు, బీఎల్‌వో పర్యవేక్షకులు శిక్షణలో పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బుధవారం ఉదయం అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారుల ఇళ్ల స్థలాల వద్ద ముగ్గులు వేసి శుభారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి మొత్తం 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గతంలో ఇల్లు పొందిన వారు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల 8 దరఖాస్తులు కలెక్టరేట్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు మండల అభివృద్ధి అధికారి తెలిపారు. ఏళ్ల తరబడి సొంత ఇల్లు కలగానే మిగిలిపోయిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఆశలను నింపింది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, దినసరి కార్మికులు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సొంత ఇంటి నిర్మాణానికి దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత భూమి ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ లబ్ధిదారులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు మహిళలు ఇళ్ల స్థలాల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కర్ణాకర్, గ్రామ సర్పంచ్ బండం శోభారాణి-రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిప్పల ప్రభాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ ములకల నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) అమలుపై కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జూన్ 18న ఉదయం 11 గంటలకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, మాస్టర్ ట్రైనర్లు హాజరై ఓటరు జాబితాల సవరణ విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో 87 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), 10 మంది బీఎల్వో పర్యవేక్షకులు పాల్గొననున్నారు. ఇందులో కాటారం మండలం నుంచి 36 మంది బీఎల్వోలు, 4 మంది పర్యవేక్షకులు, మహాముత్తారం మండలం నుంచి 27 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు, మల్హర్‌రావు మండలం నుంచి 24 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు హాజరు కానున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా ప్రతినిధులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్ కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
కాటారం, జూన్ 17 : కాటారం మండలంలో 2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిణి (ఎంఈవో)పై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, ఎంఈవో శ్రీదేవి గానీ, ఎంఆర్సీ సిబ్బంది గానీ తమ బిల్లుల మంజూరు విషయంలో ఎప్పుడూ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో ఎంఈవో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ బిల్లుల చెల్లింపుల విషయంలో డబ్బులు అడిగినట్లు కొందరు వ్యక్తులు ఉపాధ్యాయ సంఘాలకు తప్పుడు సమాచారం అందించడంతోనే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు.
వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేయడం బాధాకరమని, ఎంఈవో శ్రీదేవి ప్రతిష్టకు భంగం కలిగించేలా చేసిన అసత్య ప్రచారాలను 2008-డీఎస్సీ ఉపాధ్యాయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఖండన తెలిపిన ఉపాధ్యాయులు:
ఈ. అరుణ, జె. స్వప్న, పి. స్వప్న, వి. సుమతి, పి. పద్మజ.
ఇట్లు,
2008-డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, కాటారం మండలం.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణలో ప్రాథమిక విద్య (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) రంగం ఒకవైపు కొత్త సంస్కరణలతో ముందుకు సాగుతుండగా, మరోవైపు ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల నమోదు తగ్గుదల, మౌలిక సదుపాయాల సమస్యలు వంటి కీలక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి కోట అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించడం స్వాగతించదగిన నిర్ణయమని పేర్కొన్నారు. దీనివల్ల చిన్నారుల్లో అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం, పాఠశాల సిద్ధత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఇంగ్లీష్ మీడియం బోధన విస్తరణతో ప్రభుత్వ పాఠశాలలపై కొంతమేర విశ్వాసం పెరిగిందని తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. అనేక ప్రాథమిక పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తుండగా, సుమారు 3 వేల పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయని వివరించారు. UDISE+ నివేదిక ప్రకారం ప్రతి ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి కేవలం ఒకే తరగతి గదితో నడుస్తోందని, దీంతో ఒకే గదిలో బహుళ తరగతుల విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతూ ఉండటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడగా, దేశవ్యాప్తంగా సున్నా నమోదు కలిగిన పాఠశాలల్లో తెలంగాణ వాటా అధికంగా ఉందని కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం 157 మూతపడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మన్ననూర్ తదితర ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాషలో విద్య పరిమితంగా ఉందని, ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మారుమూల తండాలు, గూడెల్లో పాఠశాలలకు చేరుకోవడం కష్టతరంగా మారడంతో డ్రాప్‌అవుట్ రేటు పెరుగుతోందన్నారు. గోండి, కొయ, నాయకపోడ్, కొలాం వంటి స్థానిక భాషల్లో ప్రాథమిక విద్య అందించడం అత్యవసరమని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అలాగే మాతృభాష ఆధారిత బహుభాషా విద్యను అమలు చేయడం, ఒకే గది పాఠశాలల సమస్యను పరిష్కరించడం, డిజిటల్ సదుపాయాలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రాథమిక విద్య ప్రస్తుతం అవకాశాలు మరియు సవాళ్ల మిశ్రమ దశలో ఉందని, ముఖ్యంగా ఆదివాసీ మరియు గ్రామీణ ప్రాంతాల పిల్లలకు సమాన విద్యా అవకాశాలు కల్పించడం రాష్ట్ర విద్యా విధానంలో ప్రధాన లక్ష్యంగా ఉండాలని కోట అశోక్ అన్నారు.

ఇట్లు, కోట అశోక్ AHPS జిల్లా కార్యదర్శి ఉప సర్పంచ్, జాధరవ్‌పేట

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం గ్రామ పరిధిలోని ఆదర్శ కాలనీలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను లాక్కెళ్లడం, ఇంటి సామగ్రిని ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కోతుల దాడుల భయంతో బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. కోతుల సంచారంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కోతుల బెడద నుంచి ఆదర్శ కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, జూన్ 15: కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలు వాహనదారులకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు, సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు, జెండాలు ఇప్పటికీ తొలగించకపోవడంతో కూడలి వద్ద దృశ్యమానత తగ్గుతోందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోందని ఆరోపించారు. గారేపల్లి అంబేద్కర్ సెంటర్ మంథని–భూపాలపల్లి, భూపాలపల్లి–కాలేశ్వరం ప్రధాన రహదారులు కలిసే రద్దీ కూడలి కావడంతో అక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఒత్తిడి ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు, జెండాలు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని కోరుతున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై గతంలోనూ అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని కొందరు విమర్శిస్తున్నారు. విగ్రహం గౌరవాన్ని కాపాడేందుకు, ప్రజల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఫ్లెక్సీ రహిత జోన్‌గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల కొందరు యువకులు అక్కడ ఏర్పాటు చేసిన జెండాలను తొలగించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ సెంటర్ పరిసరాల్లో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మంథని, జూన్ 14: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో చేపడుతున్న చెరువుల సుందరీకరణ పనులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, పోచక్క తల్లి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. తదనంతరం రావుల చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి, భారీ వర్షాలు కురిసేలోపు పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనిచేసి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా పనులకు అంతరాయం కలిగితే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల అమలులో స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అధికారులను ప్రశ్నించిన మంత్రి, ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట, జూన్ 12: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో తాటి ఈత చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో, సర్వే నంబర్ 105లో ఉన్న సుమారు 3 వేల తాటి ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయని స్థానిక గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ ఘటనలో తాటి చెట్లతో పాటు మోటార్లు, పైపులు పూర్తిగా కాలిపోవడంతో బాధితులకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గీత కార్మికుల జీవనోపాధికి తీవ్ర దెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్ మాట్లాడుతూ, తాటి చెట్లను దహనం చేయడం ద్వారా గీత కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీశారని అన్నారు. బాధ్యులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు ముష్మీర్ మహేష్ గౌడ్, బొమ్మకంటి రమేష్ గౌడ్, రాచకొండ బాలయ్య గౌడ్, బొమ్మకంటి కిషోర్ గౌడ్, బొమ్మకంటి చక్రపాణి గౌడ్, వ్యాసరేని కనకయ్య గౌడ్, వ్యాసరేని భూమేష్ గౌడ్, ఉత్కం పెంటయ్య గౌడ్, మద్ది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

భూపాలపల్లి, ప్రతినిధి: భూపాలపల్లి బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తి ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సింగరేణి పరిరక్షణ పేరిట భూపాలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అయితే ఈ సదస్సుకు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారికి ఆహ్వానం అందలేదనే ప్రచారం పార్టీలో చర్చకు దారితీసింది. అంతేకాకుండా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిలో మధుసూధనాచారి ఫోటో కనిపించకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తూ, విషయాన్ని నేరుగా హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాలతో భూపాలపల్లి బీఆర్ఎస్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూధనాచారి వర్గాల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని గమనించిన హరీష్ రావు పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంగా భూపాలపల్లి బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తుండగా, ఈ వర్గపోరు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సిద్దిపేట, జూన్ 13: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో ఉన్న తాటి చెట్ల తొలగింపు ఘటనపై జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీ సహాయంతో తొలగించారని ఆరోపిస్తూ గౌడ సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అంతకుముందు జై గౌడ ఉద్యమం నాయకులు సంబంధిత అధికారులను కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గీత కార్మికుల జీవనోపాధికి నష్టం వాటిల్లిందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గణగోని చంద్రం గౌడ్, జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, గ్రామ అధ్యక్షుడు యాదగౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.