కాటారం, జూన్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బుధవారం ఉదయం అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారుల ఇళ్ల స్థలాల వద్ద ముగ్గులు వేసి శుభారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి మొత్తం 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, గతంలో ఇల్లు పొందిన వారు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల 8 దరఖాస్తులు కలెక్టరేట్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నట్లు మండల అభివృద్ధి అధికారి తెలిపారు. ఏళ్ల తరబడి సొంత ఇల్లు కలగానే మిగిలిపోయిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కొత్త ఆశలను నింపింది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, దినసరి కార్మికులు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సొంత ఇంటి నిర్మాణానికి దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత భూమి ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ లబ్ధిదారులు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు మహిళలు ఇళ్ల స్థలాల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కర్ణాకర్, గ్రామ సర్పంచ్ బండం శోభారాణి-రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిప్పల ప్రభాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ ములకల నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: