భూపాలపల్లి, ప్రతినిధి: భూపాలపల్లి బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందనే అసంతృప్తి ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సింగరేణి పరిరక్షణ పేరిట భూపాలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అయితే ఈ సదస్సుకు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారికి ఆహ్వానం అందలేదనే ప్రచారం పార్టీలో చర్చకు దారితీసింది. అంతేకాకుండా కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు, ప్రచార సామగ్రిలో మధుసూధనాచారి ఫోటో కనిపించకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆయన వర్గీయులు ఆరోపిస్తూ, విషయాన్ని నేరుగా హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామాలతో భూపాలపల్లి బీఆర్ఎస్‌లో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరికొండ మధుసూధనాచారి వర్గాల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని గమనించిన హరీష్ రావు పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంగా భూపాలపల్లి బీఆర్ఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తుండగా, ఈ వర్గపోరు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Post A Comment: