కాటారం, జూన్ 20: తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ చట్టం-1923లోని సెక్షన్ 5, 6 ప్రకారం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో శనివారం గ్రామ రీ-సర్వేకు సంబంధించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో రీ-సర్వే ప్రక్రియ, భూ సరిహద్దుల నిర్ధారణ, సర్వే సమయంలో రైతులు, భూ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ప్రజలకు వివరించారు.
రీ-సర్వే ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ భూములకు సంబంధించిన సందేహాలు, అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ ప్రజల సహకారం అవసరమని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), తహసీల్దార్, సర్వేయర్, గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ), పంచాయతీ కార్యదర్శి (పీఎస్), గ్రామ పెద్దలు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Post A Comment: