హనుమకొండ, జూన్ 22: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే యూనిఫార్మ్స్ అందించాలని, రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపట్టింది. కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫార్మ్స్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, సరైన తరగతి గదులు, ఫ్యాన్లు, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా సామగ్రి వంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హనుమకొండ నగరంలో అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల నుంచే లక్ష రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, జిల్లా సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, జిల్లా కమిటీ సభ్యులు బొచ్చు ఈశ్వర్, ఎండి ఇస్మాయిల్, చెన్నూరి సాయికుమార్, పవన్ కుమార్, సాల్మన్ రాజ్, అభిషేక్, రణదీప్, ప్రభాస్, మల్లేష్, నాగరాజ్, సురాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: