Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 12: భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు శుక్రవారం భూపాలపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కార్యాలయానికి విచ్చేసిన హరీష్ రావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను పరిశీలించేందుకు ఓసీ–2 గనిని సందర్శించేందుకు హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. అయితే గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని చెబుతోందని, నిజంగా నిల్వలు ఉంటే వాటిని ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వల విషయంలో ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు గనిలోకి అనుమతి నిరాకరించడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతసేపు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.















