సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామంలో కులదైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయం సమీపంలో 12 సంవత్సరాల క్రితం నాటిన తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించడంపై గౌడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రామానికి చెందిన వక్ఫ్ బోర్డు సర్వే నంబర్ 265లో ఉన్న, కల్లు తీయడానికి అనువుగా ఎదిగిన తాటి చెట్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేయడం గీత కార్మికుల జీవనోపాధిపై దెబ్బతీసే చర్యగా అభివర్ణించాయి. కాంతారెడ్డి సువర్ణదేవి, ఆమె కుటుంబ సభ్యులు జేసీబీ (AP 23 AI 6355) సహాయంతో చెట్లను తొలగించారని ఆరోపిస్తూ, ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తాటి చెట్లు గౌడ కుటుంబాల జీవనాధారమని, వాటిని అక్రమంగా తొలగించడం వందలాది గీత కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గణగోని చంద్రం గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంధపు హరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని పరుశురాం గౌడ్, మండల అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగౌడ్, మెరుగు మహేందర్ గౌడ్, ముష్మీర్ కిష్టయ్య గౌడ్, కస్తూర్‌పల్లి గ్రామ అధ్యక్షుడు యాద గౌడ్, ఉపాధ్యక్షుడు కందుకూరి సంతోష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బోలగం యాద గౌడ్తో పాటు సంఘ సభ్యులు, గ్రామ గౌడ కులస్తులు పాల్గొన్నారు.


Post A Comment: