ఘనపూర్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, పేపర్ లీకేజీ కారణంగా మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపును ఘనపూర్ మండల కేంద్రంలో విజయవంతం చేసిన అనంతరం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుర్ర స్వాతి మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూ, మరోవైపు విద్యార్థుల ఉద్యమాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయించడం సరికాదన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం పశ్చాత్తాపం వ్యక్తం చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలకు సమయం కేటాయిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. గతంలో నీట్ పేపర్ లీకేజీ సమయంలో విద్యార్థుల పక్షాన పోరాడిన ధర్మేంద్ర ప్రధాన్, ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున పేపర్ లీకేజీ ఘటనలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని స్వాతి డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు రుద్రమరాజు, రోహన్, యజ్ఞశ్రీ, ద్రాక్షాయణితో పాటు పలువురు విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: