భూపాలపల్లి, జూన్ 12: శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇంక్లైన్ గనిని సందర్శించి సింగరేణి కార్మికులతో మమేకమయ్యారు. గనిలోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ కార్మికుల పనితీరు, పని పరిస్థితులు, సంక్షేమ సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా క్యాంటీన్, డిస్పాచ్, మ్యాన్‌రైడింగ్, విశ్రాంతి గదులు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆయన కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా గనిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కార్మికులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన మధుసూదనాచారి, సింగరేణి జనరల్ మేనేజర్‌కు ఫోన్ చేసి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు. కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థ అభివృద్ధికి కార్మికులే వెన్నెముక అని పేర్కొన్న ఆయన, కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో యాజమాన్యం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు తమ వంతు కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం భూపాలపల్లి పట్టణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్‌రావు హాజరు కానున్న సింగరేణి కార్మిక సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సింగరేణి భవిష్యత్తుపై జరిగే ఈ సదస్సు ప్రాధాన్యతను వివరించి అందరూ పాల్గొనాలని కోరారు. మధుసూదనాచారి పర్యటన సందర్భంగా పలువురు కార్మిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








Post A Comment: