మహాముత్తారం, జూలై 18: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం మహాముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతమైన మహాముత్తారంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద ప్రజలు సరైన సమయంలో చికిత్స పొందలేక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు తక్షణ వైద్యం అవసరమవుతోందని తెలిపారు. అదే విధంగా రాత్రింబవళ్లు పొలాల్లో శ్రమించే రైతులు పాము, తేలు కాట్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అవసరమైన మందులు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్యం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. స్థానిక అధికారులతో పాటు అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల వైద్య సేవలు ప్రారంభించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పీక కిరణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు రామగిరి రాజుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Mahamutharam ( మహాముత్తారం )
మహాముత్తారం పీహెచ్‌సీలో 24 గంటల వైద్యం ఎక్కడ..? టీపీఎఫ్ పీక కిరణ్ ఫైర్

Post A Comment: