భూపాలపల్లి, జూన్ 5: జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల పేర్లతో పాటు "ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్, ఫౌండేషన్" వంటి పదాలను వినియోగిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జిల్లా కార్యదర్శి బి. సుజాత ఆరోపించారు. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రికలు మరియు ఇతర ప్రకటనల్లో పాఠశాల పేర్లకు అదనంగా ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను జోడించి ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఈ పదాలను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామనే భావన కల్పించి విద్యార్థులను ఆకర్షించడమే కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి పొందిన రాష్ట్ర లేదా కేంద్ర సిలబస్‌లను మాత్రమే బోధించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు స్వలాభం కోసం ఈ తరహా పదాలను వినియోగిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి ప్రకటనల వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పేర్లను ఉపయోగిస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నెలలో పాఠశాలలు ప్రారంభమయ్యే నేపథ్యంలో జూన్ 13వ తేదీలోపు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, పాంప్లెట్లు మరియు ఇతర ప్రచార సామగ్రి నుంచి ఈ పదాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ పేర్లను ఉపయోగిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ఎదుట పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతితో పాటు సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Home
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ పేర్లు వాడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

Post A Comment: