జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని TS-RFJS-093 ‘మీ సేవ’ కేంద్రం వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కోంపల్లి గ్రామానికి చెందిన స్థానికులు, బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చిరునామా మార్పు, యజమాన్య బదిలీ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

కోంపల్లి నుంచి భూపాలపల్లికి తరలింపు

2012లో కోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3 వేల జనాభాకు సేవలందించేందుకు శ్రీ కర్రు రమేష్ పేరిట TS-RFJS-093 మీ సేవ కేంద్రం మంజూరైంది. అనంతరం 2014లో కేంద్రం వివాదాల్లో చిక్కుకుంది. కేంద్రాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా భూపాలపల్లి పట్టణంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా తరలించడంతో అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ కేంద్రాన్ని నిలిపివేసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా చిరునామా మార్పు?

మీ సేవ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం మంజూరైన గ్రామ పంచాయతీ పరిధిలోనే కొనసాగాలి. ఒకవేళ తరలించాల్సి వచ్చినా గరిష్టంగా ఒక కిలోమీటర్ పరిధిలో మాత్రమే అనుమతి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే 2022లో కోంపల్లి నుంచి భూపాలపల్లిలోని మంజూర్ నగర్‌కు కేంద్రాన్ని తరలించారని, ఇది అసలు కేంద్ర స్థలానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేదా గ్రామ సభ ఆమోదం లేకుండానే కేవలం సర్పంచ్ వ్యక్తిగత ఎన్‌ఓసీ ఆధారంగా మార్పు జరిగిందని పేర్కొన్నారు.

యజమాన్య బదిలీపైనా అనుమానాలు

2024లో ఈ కేంద్రాన్ని వేముల కుమార్‌కు బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బదిలీ ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా పాటించలేదని ఆరోపించారు. ఫ్రాంచైజీని రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు బాండ్ పత్రాల్లో పేర్కొనడం గమనార్హమని, ఫ్రాంచైజీల కొనుగోలు, అమ్మకాలను నిషేధించే నిబంధనలు ఉన్నప్పటికీ లావాదేవీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈడీఎం పాత్రపై అనుమానాలు

మంజూర్ నగర్‌లోని కేంద్రానికి సమీపంలోనే మరో గదిలో అదనపు కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాంకు లావాదేవీలను ఏసీబీ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

పూర్తి విచారణ వరకు నిర్ణయాలు వద్దు

ప్రస్తుతం మరోసారి చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం ఉందని, పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్‌ను స్థానికులు కోరారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదుదారు: అంగోత్ తిరుపతి

సెల్: 7702544818

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: