భూపాలపల్లి, జూన్ 7 : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రచార పత్రాలలో పాఠశాల పేర్లతో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్స్, మెడికల్ ఫౌండేషన్ వంటి పదాలను ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పేర్లను చూపిస్తూ తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పేద ప్రజలను మోసం చేస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. జూన్ 12లోపు ఆయా పదాలను తొలగించి, సంబంధిత ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, ప్రకటనలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల ముందు ఐసా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి బందు సుజాతతో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: