మహాముత్తారం, జూన్ 7: మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన భూక్యా నరేష్, భూక్యా సురేష్‌లపై అటవీశాఖ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారని, సంబంధిత అధికారులపై హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి న్యాయ విచారణ జరపాలని కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం నిమ్మగూడెం గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ఆదివారం భూక్యా నరేష్ తన సొంత భూమిలో భూమి చదును పనులు చేపట్టేందుకు వెళ్లగా నిమ్మగూడెం బీట్ ఆఫీసర్ శ్రీకాంత్, రెడ్డిపల్లి బీట్ ఆఫీసర్ అఖిల్ రెడ్డి కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. నరేష్‌ను చంపే ఉద్దేశంతో పురుషాంగాలపై, కాళ్లపై కొట్టడంతో పాటు మెడపై నొక్కారని తెలిపారు. ఈ దాడిని అడ్డుకునేందుకు వచ్చిన భూక్యా సురేష్‌పై కూడా కర్రలతో దాడి చేసి, శరీరంలోని పలు భాగాలపై తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. వారి అరుపులు విని సమీపంలోని రైతులు, గ్రామస్తులు వచ్చి విడిపించారని తెలిపారు. దాడి కారణంగా ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా, గ్రామస్తులు పోలీసుల సహకారంతో అంబులెన్స్‌లో భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఇదే సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. అయితే ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోందని పీక కిరణ్ విమర్శించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని, సంబంధిత అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా ఎస్పీ, ఎస్సీ-ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ రామగిరి రాజు, మండల కోఆర్డినేటర్ పుల్యాల సురేష్, వావిళ్ల సడవలి, గోల్కొండ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: