భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా మరియు అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐసా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి బి. సుజాత మాట్లాడుతూ జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు కనీస మౌలిక వసతులు లేకుండా, ప్లే గ్రౌండ్లు లేకుండా నడుస్తున్నాయని ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చుకుని పేద ప్రజల నుంచి నియంత్రణ లేని ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ జీవో నెంబర్ 91-2009కి విరుద్ధంగా “ఐఐటీ”, “జేఈఈ”, “ఒలంపియాడ్ కాన్సెప్ట్” వంటి పదాలతో బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆకర్షిస్తూ మోసపూరిత ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్ణయించిన సిలబస్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐసా జిల్లా అధ్యక్షురాలు బి. స్వాతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత జీవోలు 1, 16, 37, 42, 91లను పునరుద్ధరించి పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐసా విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: