కాటారం, మే 26: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కాటారం డివిజన్ నాయకుడు జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. కాటారం డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలను గౌరవించని వ్యక్తికి దేవస్థానం చైర్మన్ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని అన్నారు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారనే వార్తలు వెలుగులోకి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఆలయాలకు సేవ చేసేందుకు వచ్చే వారిలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలకు చెందిన మహిళలేనని, అలాంటి వారిని చిన్నచూపు చూడటం లేదా అవమానకరంగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. అదే పరిస్థితిలో తన కుటుంబ సభ్యులు లేదా మంత్రి కుటుంబానికి చెందిన మహిళలు ఉంటే కూడా చైర్మన్ ఇదే విధంగా వ్యవహరించేవారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్వయంగా స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జక్కు శ్రావణ్ డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎండోమెంట్స్ శాఖ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్థానం చైర్మన్‌పై విచారణ జరిపి, అవసరమైతే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా పేరొందిన కాలేశ్వరం క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించరాదని, భక్తుల మనోభావాలను గౌరవించేలా ఆలయ పరిపాలన కొనసాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: