భూపాలపల్లి, జూలై 7: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో అవినీతి జరుగుతోందని, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలు జరుగుతున్నాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఇటీవల జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ పంపిణీ చేసిన చీరలు 2025 పుష్కరాల కోసం కొనుగోలు చేసినవేనని ఆయన ఆరోపించారు. పుష్కరాల కోసం ఆలయ నిధులతో కొనుగోలు చేసిన వస్తువులు అక్కడికి ఎలా చేరాయో అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వర ఆలయ ఈవో శైలజా రామయ్యర్ ఆధ్వర్యంలో ఆలయంలో అవినీతి జరుగుతోందని, ఆలయ నిధుల వినియోగంపై పారదర్శకత లేదని మధూకర్ ఆరోపించారు. సమాచార హక్కు చట్టం కింద ఖర్చుల వివరాలు కోరగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల పేరుతో సమాచారం నిరాకరించారని తెలిపారు. అయితే ఆలయ ఆస్తులు, నగలు, భూముల వివరాలు వెల్లడించరాదని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొన్నదే తప్ప, ఖర్చుల వివరాలు ఇవ్వకూడదని ఎక్కడా లేదని ఆయన అన్నారు. 2025 పుష్కరాల సందర్భంగా కొనుగోలు చేసిన చీరలు, ప్రసాదం తదితర సామగ్రిలో కొంత భాగాన్ని భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం నిల్వ ఉంచుతున్నారంటూ ఆరోపించారు. అలాగే గంగాహారతి నిర్వహణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి పురోహితులను తీసుకురావడం వెనుక కమిషన్ల కోణం ఉందని విమర్శించారు. మంథని ప్రాంతంలోనే వేదపండితులు, పురోహితులు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టడం సమంజసం కాదన్నారు. కాళేశ్వరం దక్షిణకాశీగా పేరొందిన పవిత్ర క్షేత్రమని, అక్కడ అవినీతి జరిగితే భవిష్యత్ తరాలకు చెడు సంకేతాలు వెళ్తాయని మధూకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పుష్కరాలు సమీపిస్తున్న సమయంలో ఆలయ అభివృద్ధి, పారదర్శక నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించే వరకు అవినీతి కొనసాగుతుందని, ఆలయ పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కటకం జనార్ధన్, లింగంపల్లి శ్రీనివాసరావు, జోడు శ్రీనివాస్, మార్క రాము గౌడ్, కుంభం రాఘవ రెడ్డి, గోనె శ్రీనివాసరావు, శ్రీపతి బాపు, ఆన్కరి ప్రకాష్, కేదారి గీతా, మోతె రాజు, బొంతల సతీష్, కట్ల పూర్ణచందర్, వాసాల స్వప్న, జ్యోతుల మంజుల వెంకన్న, రత్నం సుమంజలి అవినాష్, తిరుతమ్మ, హరీష్ రెడ్డి, లక్ష్మీ చౌదరి, ధర్మం సింగ్, ప్రభాకర్, రమణ, అనిల్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అలీం, కిరణ్, జైపాల్, రాజేందర్, గురిజాల శ్రీనివాస్, జక్కం రవి, బద్దీ సమ్మయ్య, పిల్లి వేణు, శేఖర్, కాటం రాజేష్, అభిలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Post A Comment: