భూపాలపల్లి, మే 27: తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్ గనిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందిన కార్మికుడు కొండ్ర వెంకటేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో వెంకటేష్ మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలోని తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్‌లో గ్రేడర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ విధుల్లో ఉండగానే అస్వస్థతకు గురై మృతి చెందడం బాధాకరమని అన్నారు. కార్మికుడి మృతి విషయంలో ఏఎంఆర్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, ఇప్పటి వరకు కంపెనీ ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికుల భద్రత, సంక్షేమంపై కంపెనీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఆల్ ఇండియా సెంటర్ ఆఫ్ కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ (AICCTU) జిల్లా అధ్యక్షుడు బందు క్రాంతి మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్, నాయకురాలు బుర్ర స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: